7 May, 2026 | 1:29 AM

ప్రతాప్‌రెడ్డికి మొండి ‘చెయ్యి’!

07-05-2026 12:00 AM

అధిష్టానం తీరుపై అభిమానుల ఆగ్రహం!

షాద్నగర్, మే 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పండగ కొనసాగుతున్నా, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డికి మాత్రం నిరాశే ఎదురవుతోంది. తాజాగా ప్రకటించిన 17 కార్పొరేషన్ చైర్మన్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించి, సముచిత స్థానం కల్పిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన ప్రతాప్ రెడ్డికి, భవిష్యత్తుపై సీఎం రేవంత్ రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. కానీ, ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, పలు విడతలుగా పదవుల భర్తీ జరుగుతున్నా ప్రతాప్ రెడ్డి పేరు పరిశీలనలోకి రాకపోవడం గమనార్హం. ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వయంగా సిఫార్సు చేసినా, రెడ్డి సంఘాల నేతలు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ నేపథ్యం.. పార్టీ కోసం కృషి..

1994లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ప్రతాప్ రెడ్డికి షాద్నగర్ నియోజక వర్గంలో గట్టి పట్టుంది. 1995జెడ్పీటీసీగా విజయం, 2009లో షాద్నగర్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇంద్రా రెడ్డి వంటి ఉద్దండులకు అత్యంత సన్నిహితుడిగా పేరు ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు అండగా ఉంటూ, మున్సిపల్ మరియు స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి తనదైన శైలిలో కృషి చేస్తున్నారు.

పుణ్యకాలం దాటిపోయాక.. పదవి ఇస్తే లాభమేంటి?

‘పుణ్యకాలం దాటిపోయాక చేసేది ఏమీ ఉండదు‘ అన్న చందంగా కాంగ్రెస్ తీరు ఉందని రాజకీయ విశ్లేషకులుఅభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల పాలనలో ఇప్పటికే సగం కాలం ముగిసిపోయింది. వచ్చే ఎన్నికల మూడ్ వచ్చే లోపు పదవి ఇవ్వకపోతే, చివరి నిమిషంలో ఇచ్చే ’బుజ్జగింపు’ పదవుల వల్ల పార్టీకి గానీ, నాయకుడికి గానీ పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అభిమానులుమండిపడుతున్నారు

సానుభూతి పవనాలు.. నష్టం తప్పదా?

సౌమ్యుడిగా, నిశ్శబ్ద విప్లవకారుడిగా పేరున్న ప్రతాప్ రెడ్డి విషయంలో అధిష్టానం ’శీతకన్ను’ వేయడం నియోజకవర్గంలో ఆయనపై సానుభూతిని పెంచుతోంది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే, రాబోయే రోజుల్లో పార్టీ అంతర్గత విభేదాలు బయటపడి, అది కాంగ్రెస్ మనుగడకే నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ప్రతాప్ రెడ్డికి తగిన గుర్తింపునిస్తారో లేక ’మొండిచేయి’నే శాశ్వతం చేస్తారో వేచి చూడాలి.