7 May, 2026 | 1:29 AM

అమ్మనాన్నల స్మృతిలో ప్రజాసేవ

07-05-2026 12:00 AM

కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్

చిట్కుల్‌లో ఘనంగా నీలం రాధ-నిర్మల్ వర్ధంతి వేడుకలు

పటాన్ చెరు, మే 6 : కన్నవారు చూపిన సేవా మార్గంలో నడుస్తూ, వారి జ్ఞాపకాలను ప్రజల గుండెల్లో సజీవంగా ఉండేలా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. కరోనా ఆపత్కాలంలో ఒక్కరోజు వ్యవధిలో మరణించిన తన తల్లిదండ్రులు స్వర్గీయ నీలం రాధ, నిర్మల్  5వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం చిట్కుల్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నీలం మధు తన తల్లిదండ్రుల కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి భావోద్వేగంతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ, నలుగురికి సాయం చేయాలనే తపనే నేడు తనను ప్రజా క్షేత్రంలో నిలబెట్టాయని గుర్తు చేసుకున్నారు.

పదవులు ఉన్నా లేకున్నా, సామాన్యుడి కష్టాల్లో తోడుండటమే తల్లిదండ్రులకు తాను ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నీలం మధు  కుటుంబ సభ్యులతోపాటు ఆయన అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.