ఆశ వర్కర్లను ముందస్తు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య
ఆశా వర్కర్లకు కనీస వేతనం 18 వేలు అందించాలి...
సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు
మునుగోడు (విజయక్రాంతి): ఆశ వర్కర్ల డిమాండ్లను పరిష్కరించకుండా ముందస్తు అరెస్టు చేయడం ప్రభుత్వం వైఖరి దుర్మార్గమైన చర్య అని సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు అన్నారు. మంగళవారం ఆశ వర్కర్ల సమస్యలలో భాగంగా రాష్ట్ర కమిటీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో మండలంలోని ఆశ వర్కర్లను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడానికి తీవ్రంగా ఖండించారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం 18వేలు అందించి ఈఎస్ఐ, పిఎఫ్, కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎలాంటి ఉద్యోగ భద్రత ఇవ్వకుండా వాళ్లను అన్ని రకాలుగా గ్రామాలలో వెట్టి చాకిరి చేయిస్తూ గర్భిణీలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ పుట్టబోయే పసికందు ప్రాణాలకు రక్షణగా గ్రామాలలో ఆశ వర్కర్లు పనిచేస్తున్నారని వారి సేవను కొనియాడారు. ఆశా వర్కర్ల సమస్యలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా వారిని అరెస్టు చేయడం దుర్మార్గమైన దుశ్చర్య అని అన్నారు. ఆశా కార్యకర్తల ప్రస్తుతం వేతనాలు 9 వేలు ఉన్న వేతనంను కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా అధికారం రాగానే 18 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వారిని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు సిఐటియు పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు.






