12-06-2025 01:37:53 AM
రాష్ట్ర వ్యాప్తంగా 210 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్ల్లో ప్రీప్రైమరీ తరగతులను నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నర్సింహారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో క్లాస్ నుంచే చదువుకునే అవకాశముంది. కానీ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు అవకాశం లేదు.
దీంతో తల్లిదండ్రులంతా తమ పిల్లలను మూడేళ్లకే ప్రైవేట్ స్కూళ్ల లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గుతుండగా, ప్రైవేట్‌లో పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ స్కూళ్లలోనూ ప్రీప్రైమరీని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా 210 స్కూళ్లలో చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆలస్యంగా నిర్ణయం...
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి స్కూళ్లలో ప్రీప్రైమరీని అమలు చేయాలని భావించారు. కానీ కేవలం 210 స్కూళ్లలోనే తరగతులను ప్రారంభిస్తూ విద్యాశాఖ త్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చాలామంది తమ పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పించారని, ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు.