28 March, 2026 | 2:13 AM

ప్రైవేట్ కన్నా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రాధాన్యం

28-03-2026 12:00 AM

తాము పనిచేసే ఆసుపత్రుల్లోనే చికిత్స

ప్రభుత్వ వైద్య సేవలపై విశ్వాసం పెంపొందిస్తున్న భద్రాద్రి వైద్య సిబ్బంది

సాధారణ సిబ్బంది నుండి డాక్టర్ల వరకు మెరుగైన వైద్య సేవలకు నిలువెత్తు నిదర్శనం

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 27 ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు మెరుగైన వైద్య సేవలను అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నాయి. ఈ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందే తాము సేవలందిస్తున్న  ఆసుపత్రుల్లో చికిత్స పొందడం విశేషంగా నిలుస్తోంది. నర్సింగ్ ఆఫీసర్లు , ఫార్మసిస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్ , ఆఫీస్ సిబ్బంది నుండి డాక్టర్ల వరకు ఇదే తరహాలో తమ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలకు ప్రాధాన్యతనీస్తున్నారు .

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమకు లభించే రీయింబర్స్మెంట్, హెల్త్ కార్డ్ వంటి సదుపాయాల కారణంగా పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులు లేదా కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించే పరిస్థితి ఉంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో పనిచేసే సిబ్బంది అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాము పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులపైనే నమ్మకం ఉంచుతూ తమకు, తమ కుటుంబ సభ్యులకు అక్కడే చికిత్స చేయిస్తున్నారు.

ఇటీవల పలువురు మహిళా సిబ్బంది తాము పనిచేస్తున్న ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకొని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. కొంతకాలం క్రితం పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్ ఆఫీసర్ మమత సిజేరియన్ ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. వారం క్రితం అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్ తగరం గణేష్ తన భార్యకు సుఖప్రసవం నిర్వహించి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అలాగే ఇల్లందు ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న రజని సిజేరియన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. భద్రాచలం ఆసుప్రతిలో పనిచేస్తున్న డాక్టర్ ఆశా పర్వీన్ కి అదే ఆసుపత్రిలో సుఖప్రసవం జరిగింది.

భద్రాచలం నర్సింగ్ సూపరింటెండెంట్ యశోద కూతురికి డెలివరీ తర్వాత పుట్టిన శిశువు వెంటనే ఏడుపు రాకపోతే కొన ఊపిరితో ఉన్న శిశువును సైతం ఆ ఆసుపత్రిలోని పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స చేసి ఊపిరి పోసారు. గడిచిన ఒక సంవత్సరం కాలంలో పదుల సంఖ్య లో సిబ్బంది భద్రాచలం, మణుగూర్ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగాయి. ప్రసవాలే కాకుండా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కంటి ఆపరేషన్లు, ఎముకల ఆపరేషన్లు, గర్భసంచి ఆపరేషన్లు,  ఇతర సేవలు సైతం తాము పనిచేస్తున్న ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, ఆసుపత్రులలో వసతులు వైద్య ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 

మెరుగైన వైద్య సౌకర్యం 

అన్ని ఆసుపత్రుల్లో 24 గంటల వైద్య సేవలు, ఉచిత రక్త పరీక్షలు, టీఫా స్కానింగ్, ఏసీ వార్డులు, పరిశుభ్రమైన వాతావరణం, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, రోగులకు అనుకూల సౌకర్యాలు,సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని డిసిహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండటంతో ఉద్యోగులు కూడా తాము పనిచేస్తున్న ఆసుపత్రులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. ఉచిత చికిత్స కి కార్పొరేట్ ఆసుపత్రులలో అవకాశాలు ఉన్నప్పటికీ ఉద్యోగులు తాము పనిచేస్తున్న ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వైనం ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో మెరుగైన నాణ్యమైన ఆధునిక వైద్య సేవలకు నిదర్శనం గా చెప్పవచ్చు .

- డిసిహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు