5 August, 2026 | 7:10 PM

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌పై ప్రాథమిక సర్వే

05-08-2026 06:34 PM

* అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఎన్హెచ్ఏఐ - డబ్ల్యూఐఐ బృందం పరిశీలన

అచ్చంపేట: మన్ననూర్–శ్రీశైలం మార్గంలో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక సాంకేతిక పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII)కు చెందిన ఇద్దరు సాంకేతిక నిపుణులు బుధవారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించారు.

దోమలపెంటలో నిర్వహించిన సమావేశంలో నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధికారి (DFO), అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిపాదిత కారిడార్ అలైన్‌మెంట్ వెంట ప్రాథమిక సర్వే నిర్వహించడం, నిర్మాణం వల్ల వన్యప్రాణులు, వాటి ఆవాసాలు, జీవవైవిధ్యంపై కలిగే ప్రభావాలను అంచనా వేయడం, అవసరమయ్యే అటవీ భూమి మళ్లింపు అంశాలను పరిశీలించారు.

నిర్మాణ సమయంలోనూ, అనంతర దశలోనూ పర్యావరణ వ్యవస్థపై పడే ప్రభావాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరంపై అధికారులు చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్నది కేవలం ప్రాథమిక సాధ్యాసాధ్యాల పరిశీలన మాత్రమేనని, సమగ్ర సాంకేతిక అధ్యయనాలు, పర్యావరణ ప్రభావ అంచనాలు, వన్యప్రాణుల పరిరక్షణకు సంబంధించిన నివేదికలు పూర్తైన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కారిడార్ నిర్మాణంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.