చర్లపల్లి జైలులో ఐటీఐ ఏర్పాటుకు సన్నాహాలు వేగవంతం
జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా
కుషాయిగూడ జూన్ 15 (విజయక్రాంతి): చర్లప ల్లి కేంద్ర కారాగారంలో ఖైదీల పున రావాసం, నైపుణ్యాభివృద్ధిని మరింత బలోపే తం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) ఏర్పాటుకు తెలంగాణ కారాగార శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఏర్పాట్లను తెలంగాణ కారాగార మరియు సంస్కరణ సేవల డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా సమీక్షించారు. ప్రతిపాదిత ఐటీఐ ద్వారా ఖైదీలకు ఉపాధి ఆధారిత సాంకేతిక, వృత్తి విద్యా శిక్షణ అందించి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కల్పించనున్నారు.
దీని ద్వారా విడుదల అనంతరం ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగి, ఖైదీలలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అధికారులు భావిస్తున్నారు. ఐటీఐ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహకాలలో భాగంగా డా. సౌమ్య మిశ్రా హైదరాబాద్లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మరియు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్లను సందర్శించి మౌలిక వసతులు, శిక్షణా విధానాలు, అఫిలియేషన్ ప్రక్రియలపై అవగాహన పొందారు.
అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని సందర్శించి ఐటీఐ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, అఫిలియేషన్ ప్రక్రియలు, ఇతర సన్నాహక పనులను సమీక్షించారు. కారాగారాల్లో నాణ్యమైన సాంకేతిక విద్య అందించడం అవసరమని పేర్కొన్న ఆమె, ఐటీఐ ప్రారంభానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఎన్. మురళీ బాబు, డి. శ్రీనివాస్, ఎం. ఖాలిద్ అఖ్తర్, జి. ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.






