సిద్దాపూర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు సన్నాహాలు?
పచ్చని పల్లెల్లో కాలకోట విషం...?
బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ
షాద్నగర్, మే 6 (విజయక్రాంతి) : సిద్ధాపూర్ రెవెన్యూ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడుతామని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ అన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఇందుకోసం సిద్దాపూర్ రెవెన్యూ పరిధిలో 330 ఎకరాల అసైన్ భూమి సేకరించి టీజీఐఐసీకి అప్పజెప్పిందని తెలిపారు.
పరిశ్రమలు వస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భావించిన స్థానిక రైతులు యువతకు ఇప్పుడు అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు స్థలం కేటాయించడం సరికాదన్నారు. డంపింగ్ యార్డ్ కేటాయిస్తున్నారన్న వార్తతో స్థానికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో భూగర్భ జలాలు విషపూరితమవటం అవడంతో పాటు చర్మవ్యాధులు ఏర్పడతాయని ఇక్కడ స్థానికులు వాపోతున్నారు.
దీనివల్ల వ్యవసాయ ఆధారిత పొలాలు నాశనమై పశువులు ఆరోగ్యం దెబ్బతిని మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రాంత పరిసర గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఉపాధి నిచ్చే పరిశ్రమలు కావాలని కాలుష్యం పంచే డంపింగ్ యార్డ్ మాకొద్దని, ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






