25-04-2025 01:18:44 PM
న్యూఢిల్లీ: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం వాటికన్ సిటీకి బయలుదేరారు. దాదాపు 1,300 ఏళ్లలో తొలి యూరోపియన్ కాని పోప్ ఫ్రాన్సిస్ (88) ఈస్టర్ నాడు(సోమవారం) మరణించారు. ఈ వారం చివర్లో ఫ్రాన్సిస్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించనున్న నేపథ్యంలో భారత్ తరుపున రాష్ట్రపతి ముర్ము ఇవాళ వాటికన్ నగరానికి వెళ్లారు. ఆమెతో పాటు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా శాసనసభ డిప్యూటీ స్పీకర్ జాషువా డి సౌజా కూడా ఉన్నట్లు మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ముర్ము వాటికన్ నగరానికి చేరుకున్న అనంతరం సెయింట్ పీటర్ బసిలికా వద్ద పుష్పగుచ్ఛం ఉంచి పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులర్పిస్తారు. రాష్ట్రపతి రెండు రోజుల పాటు వాటికన్ నగరంలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 26న అధ్యక్షుడు వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే హిస్ హోలీనెస్ పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరవుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది. పోప్ ఫ్రాన్సిస్ మృతికి భారతదేశం మూడు రోజుల రాష్ట్ర సంతాప దినాలను ప్రకటించింది.