వర్షాకాలం అప్రమత్తతోనే ప్రమాదాల నివారణ
- విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు అవసరం
- ఎస్ఈ రాజన్న
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): వర్షా కాలంలో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ (SE) బీ రాజన్న (B.RAJANNA) సూచించారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు మెరుపుల కారణంగా పెద్ద పెద్ద వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి కనిపించినా, స్తంభాలు ఒరిగిపోయినా, ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకర స్థితిలో ఉన్నా, వెంటనే సమీప విద్యుత్ అధికారులకు లేదా విద్యుత్ అత్యవసర సేవల టోల్ ఫ్రీ నంబర్ (1912)కు సమాచారం అందించాలని కోరారు.
వినియోగదారులు పాటించాల్సిన భద్రతా సూచనలు ఇవే.
* వర్షాలు కురుస్తున్నప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు, సపోర్టు వైర్లు, స్విచ్ బోర్డులు, పరికరాలను తాకరాదు.
* తెగిపోయిన, వేలాడుతున్న లేదా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లో తాకవద్దు. వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలి.
* బట్టలు ఆరవేసే జి.ఐ.(GI) దండాలపై విద్యుత్ వైర్లు ఉంటే షాక్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ దండాలను మాత్రమే ఉపయోగించడం మేలు.
* ఇంటి ముందు ఉన్న రేకులు, మెటల్ షీట్లు, గేట్లు మొదలైన వాటికి విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉన్నందున వైర్లు వాటిని తాకకుండా జాగ్రత్త వహించాలి.
* ఇంటి వైరింగ్‌కు సరైన ఎర్తింగ్ తప్పనిసరి.
* ఐఎస్ఐ మార్క్ గల నాణ్యమైన ప్లగ్గులు, స్విచ్‌లు, ఛార్జర్లు మాత్రమే ఉపయోగించాలి.
* సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి తడి చేతులతో మాట్లాడకండి – ముందుగా ఛార్జింగ్ ఆఫ్ చేయండి.
రైతులు పాటించాల్సిన జాగ్రతలు ఇవే...
* వ్యవసాయ మోటార్లు, ఫుట్ వాల్వులు, పైపులు తడిగా ఉన్నప్పుడు తాకరాదు.
* పంపుసెట్లు, స్టార్టర్లు తప్పనిసరిగా సరైన ఎర్తింగ్‌తో ఉండాలి.
* ఎర్తింగ్ లేని మోటార్లు, జి.ఐ. పైపులు, ఫుట్ వాల్వులు అత్యంత ప్రమాదకరం.
* విద్యుత్ పనులను స్వయంగా చేయకుండా అర్హత కలిగిన ఎలెక్ట్రిషియన్ ద్వారా మాత్రమే చేయించాలి.
* వ్యవసాయ మోటార్లకు జాయింట్లు లేని నాణ్యమైన సర్వీస్ వైర్లు మాత్రమే వినియోగించాలి.
* పశువులను మేతకు తీసుకువెళ్తున్నప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల దగ్గరకు వెళ్లనీయకండి.
* కాపరులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలి.
* ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేర్లు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు.
* ఏబి స్విచ్‌లు ఆపరేట్ చేయడం నిషేధం.
* కాలిన తీగలను స్వయంగా సరిచేయకూడదు.
* ఎవరికైనా కరెంట్ షాక్ తగిలితే వెంటనే చేతులతో తాకవద్దు.
* కర్ర లేదా ప్లాస్టిక్ వంటి విద్యుత్ ప్రసారం కాని వస్తువుతో వేరు చేయాలి.
* ఇనుప కూలర్లు ఆన్ లో ఉండగానే నీళ్లు పోయరాదు, ప్లాస్టిక్ కూలర్లు వాడటం ఉత్తమం.
* తీగల కింద టెంట్ లు , జెండా గద్దెలు కట్టరాదు.
* లైన్ల మధ్యల నుంచి ఇనుప నిచ్చెనలు తీసుకు వెళ్ళేటపుడు జాగ్రత్త వహించాలి.
* దేవుళ్ళ విగ్రహాల ఊరేగింపు సమయంలో విద్యుత్ లైన్ లకు తాకకుండా జాగ్రత్త పడాలి.
* కరెంట్ వైర్లతో చేపలు పట్టరాదు.
* పంట పొలాలను అడవి పందుల భారీ నుంచి రక్షించడానికి కరెంట్ ఫెన్సింగ్ పెట్టవద్దు. ఇది చట్ట రీత్యా నేరం.
సరైన ఎర్తింగ్ లేకనే ప్రమాదాలు...
నాసిరకం వైరింగ్, నాణ్యతలేని పరికరాలు, ఎర్తింగ్ లేకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎస్ ఈ రాజన్న వెల్లడించారు. ప్రతి వినియోగదారు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఐఎస్ఐ మార్క్ గల పరికరాలను ఉపయోగించాలని కోరారు. పిర్యాదులు, విద్యుత్ సమాచారం కోసం 1912తో పాటు వినియోగదారులు వాట్సాప్ (8712481489) చాట్‌బాట్ ను కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాట్సాప్‌లోకి వెళ్లి కావలసిన సేవలను సులభంగా పొందవచ్చన్నారు. ఈ సేవలను నేరుగా యాక్సెస్ చేయడానికి https://wa.me/918712481489 లింక్ పై క్లిక్ చేసి పొందవచ్చన్నారు.
అదే విధంగా ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాల ద్వారా హఠాత్తుగా సంభవించే సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. సబ్‌డివిజన్ స్థాయిలో వాహనాలను సిద్ధంగా ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మత్తులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ తదితర మెటీరియల్ ముందుగానే అందుబాటులో ఏర్పాటు చేసుకొని వాహనాలకు GPRS (Global Positioning / Tracking System) ఏర్పాటు చేయడంతో సమస్య ఏర్పడిన ప్రాంతానికి బృందాన్ని వెంటనే పంపించి వేగంగా సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు.






