25 March, 2026 | 2:09 AM

పోక్సో కేసులో పూజారికి ఐదేళ్ల జైలు

25-03-2026 12:00 AM

2020లో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు

రాజేంద్రనగర్, మార్చి 24(విజయక్రాంతి): పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్‌లోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టు మంగళవారం కీల క తీర్పు వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తి అంజనేయులు శిక్షను ఖరారు చేశారు. కేసు వివరాల్లోకి వెళ్లితే.. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలానికి చెందిన పురాణం రామకృష్ణ శాస్త్రి (60) మియాపూర్‌లోని నాడిగడ్డ తండాలో పూజారిగా పని చేసేవాడు.

2020 లో ఓ బాలికపై లైంగిక దాడి పాల్పడినట్లు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.సుదీర్ఘ విచారణ అనంతరం నేరం నిరూపితం కావడంతో నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.మూడు వేలు నగదు జరిమానా విధించారు. బాధిత బాలికకు లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే లా చేయడంలో మియాపూర్ ఏసీపీ ఎస్. కృష్ణప్రసాద్, ఇన్‌స్పెక్టర్ శివ ప్రసాద్ నేతృత్వంలోని బృందం పకడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించింది. ప్రభుత్వ పక్షాన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్‌పీపీ) వెంకటేశ్వర రెడ్డి వాదనలు వినిపించగా, సీడీఓ బీ రమేష్, లైజన్ ఆఫీసర్ శివారెడ్డి కోర్టు విచారణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు.