ప్రధాని మోదీ టెర్రరిస్ట్
- ప్రత్యర్థులను ఎల్లప్పుడూ బెదిరించాలని చూస్తారు
- అందుకు.. ఐటీ ,ఈడీ, సీబీఐని అడ్డంపెట్టుకుంటారు
- చెన్నై మీడియా సమావేశంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు
- పెద్ద ఎత్తున రాజకీయ దుమారం.. బీజేపీ నేతల ఆగ్రహం
- తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఖర్గే వివరణ
చెన్నై, ఏప్రిల్ 21: ప్రధాని నరేంద్ర మోదీ ఒక టెర్రరిస్ట్ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను బెదిరించాలని చూస్తారని ఆరోపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల చివరిరోజు ప్రచారంలో భాగంగా మంగళవారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ద్రవిడ ఉద్యమ నేత అన్నాదురై ఆశయాలకు విరుద్ధంగా ఆ పార్టీ మోదీతో అంటకాగుతున్నదని విమర్శించారు. బీజేపీ నేతలకు సమానత్వం అంటే నచ్చదని, సామాజిక న్యాయంపై విశ్వాసం లేదని ఆరోపించారు. అలాంటి పార్టీతో అన్నాడీఎంకే పొత్తు ఏంటని ప్రశ్నించారు. తమిళ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో అన్నాడీఎంకే విఫలమైందని దుయ్యబట్టారు. ఆ పార్టీ ఇప్పుడు బీజేపీకి బానిసగా మారిందని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలపడం అంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని అభిప్రాయపడ్డారు.రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన తర్వాత, జాతిని ఉద్దేశించి ప్రసంగించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంస్థలా పనిచేస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజనను తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రధాని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ అడ్డుపడుతున్నదని మోదీ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. తాము ఆ బిల్లుకు గతంలోనే పూర్తి మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. గడిచిన 12 ఏళ్లుగా మోదీ దేశ ప్రజలకు చేసిన మేలేమీ లేదని విమర్శించారు.
ప్రధాని ఒక అబద్ధాల కోరు అని ధ్వజమెత్తారు. ఆయన మనుస్మృతిని నమ్ముతారని, మహిళలకు, పేదలకు వ్యతిరేకమని ఆరోపించారు. తమిళనాడు హక్కుల కోసం పోరాడే కాంగ్రెస్ -డీఎంకే కూటమికే ప్రజలు ఓటు వేయాలని ఆయన కోరారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే సామాజిక న్యాయం, లౌకికవాదం సాధ్యమవుతా యని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే కూటమికి అండగా నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ నేతల ఆగ్రహం
ప్రధాని మోదీ టెర్రరిస్ట్ అని మల్లికార్జున ఖర్గే పేర్కొనడంపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిని ఉగ్రవాది అని సంబోధించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వ్యాఖ్యల ద్వారా దేశ ప్రజలను అవమానించారని, తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ.. అర్థవంతమైన చర్చలు చేయలేకనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
పార్టీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రో స్పందిస్తూ.. ఖర్గే వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచమైన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఏఐసీసీ రాహుల్ గాంధీ ప్రోద్బలంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి, ఖర్గే ఓర్వలేకనే తిడుతున్నారని విమర్శించారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే చరిత్ర కాంగ్రెస్‌దేనని ఎద్దేవా చేశారు. ఒక దేశ ప్రధానిని గౌరవించని వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
వ్యాఖ్యల వక్రీవరణ: ఖర్గే
తన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దు మారం చెలరేగడంతో ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను మోదీని టెర్రరిస్ట్ అని అనలేదని, తన వ్యాఖ్యల వక్రీకరణ జరిగిందని తెలిపారు. మోదీ ఎల్లప్పుడూ రాజకీయ పార్టీలను, ప్రజలను టెర్రరైస్ చేస్తారని చెప్పడమే తన వ్యాఖ్యల్లోని ఉద్దేశమని తెలిపారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వా మ్యాన్ని దెబ్బతీస్తున్నారని మాత్రమే తాను వ్యాఖ్యానించానంటూ వివరణ ఇచ్చారు.






