22 April, 2026 | 3:10 AM

పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు

22-04-2026 01:51 AM
  1. కేరళలోని ముండతికోడ్‌లో ఘటన 
  2. 13 మంది మృతి.. ౪౦ మందికి పైగా గాయాలు
  3. ఆసుపత్రికి తరలింపు.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమం
  4. ఘటనపై సీఎం విజయన్ దిగ్భ్రాంతి

త్రివేండ్రం, ఏప్రిల్ ౨౧: తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని ఓ పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ౨౫ మంది కార్మికులు మృతిచెందిన ఘటన మరువకముందే కేరళలో మరో ప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం కేరళలోని త్రిస్సూర్ జిల్లా ముండతికోడ్‌లోని పటాకుల తయారీ కేంద్రంలోనూ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిన్నాభిన్నమై చెల్లాచెదురుగా సమీపంలోని పొలాల్లో పడిపోయాయి.

ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ తయారీ కేంద్రం సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో పొలాల మధ్య ఉంది. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. దట్టమైన పొగ కారణంగా స్థానికులు ఇబ్బంది పడ్డారు.

అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ మృతదేహాలను గుర్తించే పనిలో పడింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి యంత్రాంగం చెబుతోంది. త్రిస్సూర్ ప్రాంతంలో త్వరలో జరిగే పూరం పండుగ కోసం కార్మికులు పటాకులు తయారు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులైన వైద్యులను రప్పించాలని సూచించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, ప్రమాదంపై కలెక్టర్ శిఖా సరేంద్రన్ మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. ముండతికోడ్ పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై విచారిస్తున్నారు.