ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట
సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ రోల్ మోడల్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి, ఆగష్టు 16 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.. చందుర్తి మండలంలోని ఆశిరెడ్డిపల్లిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు ఆశిరెడ్డిపల్లి గ్రామంలో 20 లక్షలతో నిర్మిస్తున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి విప్ భూమి పూజ నిర్వహించారు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 24 వేల కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు అందించామని ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 1.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు.పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్లు అందించే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపడుతోందన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదని అన్నారు.
తన రాజకీయ ప్రస్థానంతో ఆశిరెడ్డిపల్లెకు విడదీయరాని అనుబంధం ఉందని విప్ తెలిపారు. 1995లో కొచ్చేరువుకు గండి పడిన తర్వాత, తాను జెడ్పీటీసీగా ఉన్న సమయంలో 1996లో పాదయాత్ర చేసి చెరువు మరమ్మతులకు రూ.45 లక్షలు మంజూరు చేయించేందుకు కృషి చేసినట్లు గుర్తు చేశారు.ఎర్రచెరువు, పటేల్ చెరువు, కొచ్చేరు చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపడితే మండలంలోని సుమారు 18 గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.
చందుర్తి మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం గర్వకారణమన్నారు. ఎన్నికలు కేవలం 15 రోజుల రాజకీయ పోటీ మాత్రమేనని, అనంతరం అందరూ కలిసికట్టుగా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. తాను నాలుగు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉంటూ ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం పొందానని గుర్తు చేశారు..వేములవాడ నియోజకవర్గ ప్రజలకు నా ఎమ్మెల్యే పదవిని అంకితం చేశానని ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం అని విప్ స్పష్టం చేశారు..






