22 April, 2026 | 1:42 AM

అధునాతన ఉత్పత్తి రంగాలకు ప్రాధాన్యం

22-04-2026 12:34 AM
  1. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అనుకూలం
  2. తెలంగాణలో విస్తృతమైన పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం
  3. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  4. ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి బృందంతో భేటీ

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): అధునాతన ఉత్పత్తి రంగాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, ఇతర రాష్ట్రప్రభుత్వాలతో పోలిస్తే తాము ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఎంతో అనుకూలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి బృందం మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రితో భేటీ అయింది.

ఈ సందర్భంగా తెలంగాణతో ఇటలీ ఎలాంటి వాణిజ్య సంబంధాలకు అవకాశం ఉందనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యావత్ ఐరోపాలోనే ఇటలీ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, మెషినరీ, ప్రిసిషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఆటోమోటివ్ సిస్టమ్స్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో అగ్రగామిగా ఉందని తెలిపారు.

అలాంటి దేశం తెలంగాణలో పెట్టుబడులు పెడితే ‘భారత్-ఇటలీ’ మధ్య వాణిజ్య సంబంధాలు బలపడటంతోపాటు తెలంగాణ రిశ్రామిక రంగానికీ ఊతమిచ్చినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. తద్వారా ఇండస్ట్రీ 4.0, రోబోటిక్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లీన్ మొబిలిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ తదితర రంగాల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందన్నారు. టీ హబ్, వీ హబ్, జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్క్, వర్సిటీలు, పరిశోధన సంస్థలతో ఇటలీ కంపెనీలు, నిపుణులు, సంస్థలు భాగస్వామ్యమయ్యేలా చొరవ చూపాలని మంత్రి కోరారు. 

వైద్యపరికరాల ఉత్పాదనకూ మౌలిక సదుపాయాలు

అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు రంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మంగళవారం నెదర్లాండ్స్‌కు చెందిన మెడిటెక్ పారిశ్రామికవేత్తలు, వర్సిటీల పరిశోధకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఔషధాల ఉత్పత్తి, వ్యాక్సిన్ల తయారీలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉందని తెలిపారు.

కొవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో స్థానిక బయోటెక్ కంపెనీలు 120 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేశాయని గుర్తుచేశారు. వైద్య రంగంలో కృత్రిమ మేథ వినియోగించేందుకూ చక్కని అవకాశాలున్నాయని వెల్లడించారు. ఇమేజింగ్ టెక్నాలజీ, క్లినికల్ వ్యాలిడేషన్, డిజిటల్ ప్రొఫైల్స్ లాంటి రంగాల్లో పెట్టుబడులకూ రాష్ట్రం అనుకూలమని వివరించారు.

నైపుణ్యం ఉన్న మానవ వనరులూ పుష్కలమని, అందుకే ప్రపంచంలోని అతిపెద్ద ఔషధ, బయోటెక్ కంపెనీలు రాష్ట్రాన్ని తమ ఉత్పాదన కేంద్రంగా మార్చుకున్నాయని వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, పరిశ్రమలశాఖ స్పెషల్ సెక్రటరీ రఘురా మశర్మ, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ సీఈవో సర్వేశ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ వేణు పాల్గొన్నారు.