26 August, 2026 | 4:06 AM

ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

26-08-2026 12:38 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

భూపాలపల్లి/ (రేగొండ) ఆగస్టు 25 (విజయ క్రాంతి): ప్రజా సంక్షేమంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని బుగులోని దేవాలయం సమీపంలో నిర్వహించిన వనమహోత్సవంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ప్రకృతి అమూల్యమైనదని, చెట్లు మానవ మనుగడకు ప్రాణాధారమని పేర్కొంటూ ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.

అనంతరం కొత్తపల్లి గోరి మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికల వద్ద స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జగ్గయ్యపేట, సుల్తాన్పూర్, గోరికొత్తపల్లి, చిన్నకోడెపాక, చెన్నాపూర్ గ్రామాల్లో మహిళా సంఘాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలకమని, పేదలు, రైతులు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు, పాల్గొన్నారు.