పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యం
సెంటర్ లైటింగ్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
అశ్వారావుపేట, జూలై 20 (విజయ క్రాంతి):అశ్వారావుపేట పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మున్సిపల్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా క్రీడా మైదానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి మౌలిక సదుపాయాలు, క్రీడాకారులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, అభివృద్ధి చేయాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు.
యువతకు నాణ్యమైన క్రీడా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని సూచించారు. అథ్లెటిక్స్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడలకు అనువుగా మైదానాన్ని తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్రీడా మైదానంలో తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, విద్యుత్ లైటింగ్, డ్రైనేజీ, క్రీడాకారులకు విశ్రాంతి గదులు, ప్రేక్షకుల కోసం కూర్చునే ఏర్పాట్లు వంటి మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతరం అశ్వారావుపేట పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ దీపాల ఏర్పాటులో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, భవిష్యత్తులో నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ ,ప్రజాప్రతినిధులు, కోలా లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు మిండా హరిబాబు, జీనుగు రవీంద్ర, స్థానిక నాయకులు, జూపల్లి ప్రమోద్, వెలుపుల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






