పాతవారికే ప్రాధాన్యత
కీలక పదవులు బీజేపీకే
బిగ్ 4కు పాత మంత్రిత్వ శాఖలే
అమిత్‌షాకు మళ్లీ కేంద్ర హోంశాఖ
రాజ్‌నాథ్‌కు రక్షణ, గడ్కరీకి రోడ్లు
నిర్మలాసీతారామన్ చేతిలోనే ఆర్థికశాఖ
శాఖలు కేటాయించిన మోదీ బొగ్గు కొరత లేకుండా చేస్తాం
తెలుగు రాష్ట్రాలకు 5 మంత్రి పదవులిచ్చినందుకు ప్రధానికి థ్యాంక్స్
వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కృషి
ట్రిపుల్ ఆర్, హైవేస్, కేంద్ర సంస్థల ఏర్పాటుకు ప్రయత్నిస్తా
బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, జూన్ 10: కేంద్ర మంత్రులకు సోమవారం శాఖలను కేటాయిం చారు. బీజేపీ బిగ్ 4గా ముద్రపడిన అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌కు గత ప్రభుత్వంలో నిర్వహించిన శాఖలనే మళ్లీ అప్పగించారు. అమిత్ షాకు హోంశాఖ, రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ శాఖ, నితిన్‌గడ్కరీకి రోడ్లు, హైవేలు, నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖలు అప్పగించారు.
తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డికి క్యాబినెట్ హోదాలో బొగ్గు, గనుల శాఖలను కేటాయించగా, సహాయ మంత్రిగా బండి సంజయ్‌కు కీలకమైన హోంశాఖను అప్పగించారు. మొత్తంగా అత్యంత కీలకమైన శాఖలన్నీ బీజేపీ మంత్రుల వద్దనే ఉండేలా శాఖల కేటాయింపు జరిగింది. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడికి కీలకమైన పౌర విమానయానశాఖను కేటాయించారు. మోదీ ఐదారు శాఖలను తనవద్దనే పెట్టుకొన్నారు. అణు ఇంధనం, సిబ్బంది వ్యవహారాలు, స్పేస్ టెక్నాలజీ వంటి శాఖలు ఆయన వద్ద ఉన్నాయి.
బొగ్గు కొరత లేకుండా చేస్తాం: కిషన్ రెడ్డి
దేశంలో బొగ్గు కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు ఉత్పత్తి పెంచుతామని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శాఖల కేటాయింపు అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా పౌరవిమానయాన శాఖ, సహాయ మంత్రులుగా బండి సంజయ్‌కు హోంశాఖ, పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, శ్రీనివాసవర్మకు భారీ పరిశ్రమ లు, ఉక్కు శాఖలు ఇచ్చినందుకు... అత్యంత కీలకమైన బొగ్గు, గనుల శాఖ మంత్రిగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు ప్రధానికి కృతజ్ఞత లు తెలిపారు.
రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ ఇచ్చినందున వరంగల్ ఎయిర్‌పోర్టు ప్రారం భించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నా రు. కేసీఆర్ ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించారని, వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం తాను ప్రత్యేక చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎయిర్ పోర్టుల కు మహర్దశ వస్తుందన్నారు. ట్రిపుల్ ఆర్, జాతీయ రహదారులు, కేంద్ర పరిశోధన సంస్థలను తెలంగాణకు తీసుకువస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
100 రోజుల కార్యాచరణతో ముందుకు
బాద్యతలు స్వీకరించిన తర్వాత 100 రోజుల అజెండా ఏర్పాటు చేసుకుని బొగ్గు, గనుల శాఖలో ప్రగతి కోసం ముందుకు సాగుతామని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశ ఇంధ న రంగంలో బొగ్గుదే కీలకపాత్ర పాత్ర అని తెలిపారు. బొగ్గు గనుల తవ్వకాలు, వాటి సరఫరా, పర్యావరణం, కార్మికుల సంక్షేమం తన శాఖ పరిధిలో ఉంటాయన్నారు. ప్రధాని మార్గదర్శకత్వంలో సమర్ధంగా పనిచేస్తామని అన్నారు. కోల్ ఇండియా, కోల్ ఫీల్డ్స్ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు.
బొగ్గు గనులు ఉత్పత్తి చేసే సంస్థలను సమన్వయం చేసుకుంటూ దేశంలో బొగ్గు కొరత లేకుండా చూస్తానని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గనుల శాఖకు సంబంధించిన ఖనిజాల తవ్వకాలు, ఉత్పత్తుల విధానాలపై మెరుగైన ఫలితాలు వచ్చేలా చూస్తామన్నారు. తనకు కేటాయించిన రెండు శాఖలు దేశానికి ఆదాయం తీసుకువచ్చే శాఖలని తెలిపారు. వీటి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరిగేలా చూస్తామని పేర్కొన్నారు. తనకంటే ముందు ఈ శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి సమర్ధంగా పనిచేశారని, వారి లాగే పనిచేసేందుకు ప్రయత్ని స్తామన్నారు.
మోదీ వచ్చాకే విద్యుత్ కోతలు లేవు
దేశంలో గతంలో విద్యుత్ కోతలు ఉండేవని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తి పెంచి విద్యుత్ కోతలు లేని దేశంగా మార్చారని కిషన్ రెడ్డి అన్నారు. తాము అదే ఒరవడిని కొనసాగిస్తూ దేశంలో బొగ్గు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలో విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు ఉత్పత్తి పెంచుతామన్నారు. గత పదేళ్లుగా పారదర్శకంగా బొగ్గు గనుల వేలం వేస్తున్నట్లు వెల్లడించారు. యూపీఏ హయాంలో బొగ్గు గనుల కుంభకోణాలు జరిగాయన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత పారదర్శకంగా వ్యవస్థ పనిచేస్తోందన్నారు.
ఈ శాఖలపై తనకు అవగాహన లేదని సాధ్యమైనంత త్వరగా వీటిపై అధ్యయనం చేసి సమర్థవంతంగా ఈ శాఖలను నడిపిస్తానని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రానున్నారని, తాను సైతం ఆ కార్యక్రమానికి వెళ్తానని కిషన్ రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగేందుకు కేంద్రం సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.






