19 June, 2026 | 3:10 AM

ప్రొటోకాల్ పాటించాలి

19-06-2026 01:47 AM

ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి: సర్పంచ్‌ల సంఘం మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి

మొయినాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటించాలని మండల సర్పంచ్ సంఘం ప్రధాన కార్యదర్శి, కాశీంబౌలి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ చైర్మన్ మాడి రాజేందర్ రెడ్డి కోరారు.

గురువారం మొయినాబాద్ మండల పరిధిలోని కాశీంబౌలి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కీలక బాధ్యతలు నిర్వహించిన కమిటీ చైర్మన్లు, సభ్యులు, గ్రామ సర్పంచ్లకు ప్రారంభోత్సవ కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు.

ఇటీవల గ్రామంలో అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ సహకారంతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీమ్ భరత్ తదితర నాయకులు పాల్గొన్నప్పటికీ, స్థానిక సర్పంచ్, కమిటీ చైర్మన్, సభ్యులకు ఆహ్వానం అందకపోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను నిర్వహించారని గుర్తు చేశారు.

అలాంటి కమిటీలను పక్కనపెట్టి కార్యక్రమాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. గ్రామాల్లో నిర్వహించే ఇళ్ల ప్రారంభోత్సవాలకు సంబంధిత కమిటీ చైర్మన్లు, సభ్యులు, సర్పంచ్లను తప్పనిసరిగా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ను పాటించడం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల మధ్య సమన్వయం పెరిగి కార్యక్రమాలు మరింత విజయవంతమవుతాయని మాడి రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ నరేష్, వార్డు సభ్యులు శివ, వెంకటేష్, గ్రామస్థులు విజయేందర్ రెడ్డి, మాడి మోహన్ రెడ్డి, సామ భూపాల్ రెడ్డి, సాయిరెడ్డి, చంద్రయ్య, సత్యనారాయణ, మైపాల్ రెడ్డి, జంగయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.