calender_icon.png 13 December, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆఫీసుకు ప్రైవేటు ట్యాంకర్లు!

13-12-2025 12:18:43 AM

బల్దియా భవనంలో నీటి దందా?

  1. పైప్‌లైన్ మరమ్మతు చేయని మెయింటెనెన్స్ విభాగం
  2. కమీషన్ల కోసం ప్రైవేటు ట్యాంకర్ల కొనుగోలు!
  3. అధికారుల తీరుపై అనుమానాలు
  4. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మూడు రోజులుగా నీటి కటకట
  5. మాకు ఒక్క ఫోన్ చేస్తే పంపేవాళ్లం: జలమండలి

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): దీపం కింద చీకటి అన్న చందంగా తయారైంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం పరిస్థితి. నగర ప్రజల దాహార్తిని తీర్చే బాధ్యత గల బల్దియా సొంత ఆఫీసులో నీటి కష్టాలను తీర్చుకోలేక చతికిలపడింది. గత మూడు రోజులుగా జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీసులో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

అయితే, ఈ సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాల్సిన మెయింటెనెన్స్ విభాగం అధికారులు.. దీనిని ఒక వ్యాపారంగా మార్చుకున్నారనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ప్రభుత్వ విభాగానికి చెందిన జలమండలి ట్యాంకర్లను కాదని, అధిక ధరలకు ప్రైవేట్ ట్యాంకర్లను తెప్పించడం వెనుక భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

95 బాత్రూంలలో చుక్క నీరు లేదు

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 7వ అంతస్తు వరకు మొత్తం 95 బాత్రూంలు ఉన్నాయి. వందలాది మంది అధికారులు, సిబ్బంది, నిత్యం వచ్చే సందర్శకులతో ఈ ఆఫీసు కిటకిటలాడుతుంటుంది. కానీ, గత మూడు రోజులుగా పైప్‌లైన్ సమస్య కారణంగా నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో దుర్భర పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం లంచ్ చేశాక చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. టాయిలెట్స్‌లలో నీళ్లు లేక దుర్వాసన వస్తుండటంతో అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది.

పైప్‌లైన్ మరమ్మతు ఎప్పుడు?

మూడు రోజులుగా సమస్య ఉన్నా ప్రధా న పైప్‌లైన్ మరమ్మతు పనుల్లో అలసత్వం వహిస్తున్నారని సిబ్బంది మండిపడుతున్నా రు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించడం తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదని, పైగా ప్రైవేట్ ట్యాంకర్ల బిల్లుల పేరు తో లక్షల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రైవేట్ ట్యాంకర్లపై ప్రేమ ఎందుకు?

నీటి ఎద్దడిని నివారించేందుకు మెయింటెనెన్స్ విభాగం రోజుకు సుమారు 15 ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తోంది. ఇక్కడే అసలు అనుమానాలు మొదలవుతున్నాయి. వాటర్ బోర్డు ట్యాంకర్లు బుక్ చేస్తే రావడం లేట్ అవుతోందని, అందుకే ప్రైవేట్ ట్యాంకర్లు తెప్పిస్తున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెపుతున్నారు. ప్రభుత్వ ట్యాంకర్లతో పోలిస్తే ప్రైవేట్ ట్యాంకర్ల ధరలు రెట్టింపు ఉంటాయి. పైగా నగరంలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల రవాణాపై ఆంక్షలు ఉన్నా యి. అయినా సరే, నిబంధనలకు విరుద్ధం గా, ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు లబ్ధి చేకూరుస్తున్నారన్నది ప్రశ్న.

మాకు చెపితే వెంటనే పంపేవాళ్లం: జలమండలి

మెయింటెనెన్స్ అధికారుల వాదనను జలమండలి అధికారులు ఖండించారు. ‘జీహెచ్‌ఎంసీ అనేది ప్రభుత్వ విభాగం. వారు మాకు ఒక్క మాట చెప్పినా లేదా ఫోన్ చేసినా తక్షణమే ట్యాంకర్లు పంపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర ట్యాంకర్ల కొరత లేదు. కానీ, ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ అధికారులు మమ్మల్ని సంప్రదించనే లేదు. ట్యాంకర్లు కావాలని అడగలేదు’ అని జలమండలి అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ సొమ్ము ఆదా చేయాల్సిన అధికారులే.. ఇలా ప్రైవేట్ వైపు మొగ్గు చూపడం వెనుక కమీషన్ల కక్కుర్తి ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.