18-02-2026 04:39:05 PM
- శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): దేశ స్వాతంత్ర్య అనంతరం భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలను భారత యూనిన్ లో విలీనం చేయడంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన తెగువ అమోఘమైనదని శాతవాహన యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.సుజాత అన్నారు. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం నిర్వహించిన "ఐరన్ మ్యాన్స్ విజనరీ లీడర్ షిప్ లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
భారత జాతిని జాగృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక భూమిక పోషించారన్నారు. దేశ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు తమ మూలాలను మరిచిపోకుండా జీవితంలో ఎదగాలన్నారు. తెలంగాణ సంస్కృతి చాలా గొప్పదని పేర్కొన్నారు. అదే విధంగా రాజకీయాలు మనం చూసే కోణాన్ని బట్టి మారతాయన్నారు. ఇలాంటి జాతీయ సదస్సులు ఈ ప్రాంతంలో జరగడం శుభసూచకమని పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జైకిషన్ ఓజా మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సు సఫళీకృతమైందన్నారు. సుమారు 50 పరిశోధన పత్రాలను ఈ సదస్సులో సమర్పించారన్నారు. ఇలాంటి సెమినార్లు ఈ కళాశాలలో ఇంకా నిర్వహిస్తామన్నారు. ఈ రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో సెమినార్ కన్వీనర్ డాక్టర్ కె.రాజయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేందర్ రెడ్డి, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.