ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
రైల్వే బ్రిడ్జిని ఢీకొనడంతో ప్రమాదం
22 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమీపంలోనే ఘటన
ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఘటన
పెనుబల్లి, జూన్ 8 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని ఏలూరు జిల్లా ముసునూరు నుంచి హైదరాబాదుకు వెళ్తున్న శ్రీ కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి జాతీయ రహదారిపై అడ్డంగా బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సులో 36 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఆసుపత్రులకు తరలించగా, మిగిలిన వారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
బస్సు అధిక వేగంతో ప్రయాణించడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. వేగంగా వస్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి బ్రిడ్జి రక్షణ గోడను ఢీకొట్టి రహదారిపై అడ్డంగా పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో మరో భారీ విషాదం తృటిలో తప్పింది.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి కేవలం ఐదు మీటర్ల దూరంలోనే రైల్వే హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉండటంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు మరికొంత ముందుకు వెళ్లి విద్యుత్ లైన్లను తాకి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బస్సును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.






