19 August, 2026 | 7:11 PM

వయనాడ్ బరిలో ప్రియాంక?

15-06-2024 01:43 AM

రాహుల్‌గాంధీ రాజీనామా చేస్తే ఆమే అభ్యర్థి!

న్యూఢిల్లీ, జూన్ 14: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ ఎన్నికల రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమె అన్న రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీచేసి రెండుచోట్లా గెలిచారు. త్వరలో ఆయన ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉన్నది. అయితే, ఉత్తరప్ర దేశ్‌లో ఈసారి కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించటంతో పార్టీని అక్కడ మరింత బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అందువల్ల రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహించి, వయనాడ్‌ను వదులుకొంటారని కాంగ్రె స్ వర్గాలు అంటున్నాయి.

అదే జరిగితే వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో రాహుల్‌తో సమానమైన బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రియాంకవైపే అందరి చూపు మళ్లింది. వయనాడ్‌లో రాహుల్‌గాంధీ గెలువటం వరుసగా ఇది రెండోసారి. 2019 ఎన్నికల్లో యూపీలోని అమేథీలో ఓడిపో యినా, వయనాడ్ ప్రజలు ఆయనను బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఈసారి కూడా తిరిగి పట్టంగట్టారు. దీంతో ఇప్పుడు ఆ స్థానాన్ని రాహుల్ వదులుకొంటే.. అక్కడి ఓటర్ల సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉన్నది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రియాంకనే సరైన అభ్యర్థి అని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె నిరాకరించారు. మరిప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో చూడాల్సిందే.