వరద నివారణపై ఆస్కీకి టాస్క్
పొరుగు రాష్ట్రాల్లో డీఆర్‌ఎఫ్ సేవలపై అధ్యయనం
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు బాధ్యతలు
15రోజుల్లోగా నివేదిక కోరిన రాష్ట్ర సర్కారు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ముంపును నివారించేందుకు దేశంలోని ఇతర మహానగరాలలో డిజాస్టర్ రెస్క్యూ బృందాల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధ్యయనం చేయనుంది. ఇందుకోసం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)కి బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా జీహెచ్‌ఎం సీ పరిధిలో వానా కాలంలో కురిసే భారీ వర్షాలు, సంభవించే విపత్తులను దేశంలోని ఇతర మహానగరాలు ఎలా రెస్క్యూ చేస్తున్నాయో పరిశీలించి, వాటిలో మెరుగైన పద్ద తులను గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కూడా అమలు చేసి విపత్తుల సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
మరో 15 డీఆర్‌ఎఫ్ బృందాలు
హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. 150 డివిజన్లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన అనేక ప్రాంతాలు హైదరాబాద్ అర్బన్ ప్రాంతంతో కలిసే ఉంటాయి. కానీ, వర్షాలు, వరదలు, విపత్తుల సమయంలో డీఆర్‌ఎఫ్ సిబ్బంది కేవలం గ్రేట ర్ పరిధిలోని 30 సర్కిళ్లకు మాత్రమే సహాయక చర్యలు అందుతున్నాయి. ఈ సేవలను ఓఆర్‌ఆర్ దాకా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న 30 బృందాలకు అదనంగా మరో 15 టీంలు కొత్తగా ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారి గ్రేటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీఆర్‌ఎఫ్ సేవలు హైదరాబాద్ మహానగరంతో ముడిపడి ఉన్న రంగారెడ్డి, జిల్లా ప్రాంతాలలోనూ విస్తరించనున్నాయి. డీఆర్‌ఎఫ్ సేవలలో జలమండలి, ట్రాఫిక్ పోలీస్, విద్యుత్ తదితర శాఖల అధికారులు కూడా భాగస్వామ్యం కానున్నారు.
మహానగరాలలో ప్రత్యేక స్టడీ
హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితే రోడ్లన్నీ జలమయం కావడం, నాలాలు నదుల్లా ప్రవహించడం తెల్సిందే. దీంతో నాలా పరీవాహక, లోతట్లు ప్రాంతాలన్నీ నీట మునిగిపోతున్న కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రేటర్ నగరంలో రోడ్లపై వరదనీరు నిలిచే ప్రాంతాలు 141 ఉన్నట్టు గుర్తించామని అధికారులు చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో వర్షం వచ్చిన ప్రతిసారీ రోడ్లపై నిలిచిన నీటిని తొలగించాల్సి వస్తుంది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ముందస్తు ప్రణాళికలో భాగంగా గ్రేటర్‌లో వరద నీరు తక్షణమే క్లియర్ అయ్యేందుకు జీహెచ్‌ఎంసీ 12 చోట్ల ప్రత్యేక సంపులు నిర్మాణం చేయనుంది.
అందులో భాగంగానే భారీ వర్షాలు, వరదలు, విపత్తులు సంభవించే సమ యంలో దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాలలో ఎలాంటి చర్యలు చేపడతారో ప్రత్యే క అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నగరాలలో స్టడీ చేయడానికి ఆస్కీకి ప్రభుత్వం బాధ్యతలు అప్పగిం చింది. 15 రోజుల్లో నివేదిక అందించాలని ప్రభుత్వం కోరింది. ఆ నగరాలలో డీఆర్‌ఎఫ్ సేవల పని విధానంపై కూడా స్టడీ చేయనుంది. ఈ సేవలు మన కంటే మెరుగ్గా ఉంటే బల్దియాలోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.






