మాట్లాడే ధైర్యం చేయొద్దు

30-04-2024 12:15:00 AM

ప్రధాని నరేంద్ర మోదీపై  ప్రియాంక గాంధీ వార్నింగ్

ప్రజ్వల్ రేవణ్న భారత్‌కు తిరిగొచ్చేదాకా మాట్లాడొద్దు

అందాక మంగళసూత్రాలు అంటూ కామెంట్ చేయొద్దు

ప్రజ్వల్ రేవణ్న ఘటనపై స్పందించాలని డిమాండ్

కలబురగి, ఏప్రిల్ 29: ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో వేల మంది అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడిన ప్రజ్వల్ రేవణ్న ఘటనపై  ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజ్వల్ రేవణ్న దేశానికి తిరిగి వచ్చేదాకా మహిళల మంగళసూత్రాలను కాంగ్రెస్ లాక్కుంటుందంటూ మాట్లాడే ధైర్యం చేయొద్దంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కర్ణాటకలో చాలా పెద్ద సంఘటన జరిగింది. ప్రధాని మోదీతో వేదిక పంచుకున్న వ్యక్తి.. ఓటేయాలని స్వయంగా ప్రధాని అభ్యర్థించిన ఆ వ్యక్తి వేల మంది అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై వెంటనే స్పందించాలి. కొద్ది రోజుల కింద నా కూతురును కలిసేందుకు మూడు రోజుల పాటు వెళ్లాను. అంతే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా నేను విదేశాలకు వెళ్లిపోయానంటూ విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు ఎక్కడికి వెళ్లినా వెంటనే వారికి తెలిసిపోతుంది. కానీ ఇలాంటి దుర్మార్గులు దేశం విడిచి పారితుంటే మీకు తెలియదా? మీకు తెలియదంటే మేం ఎలా నమ్మాలి? వాళ్లకు అందరి వివరాలు తెలుసు. వారి అండదండలతోనే అతడు దేశం విడిచి పారిపో యాడు. ఇలాంటి వారిని వారు ఏమీ చేయరు’ అని ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అప్పటిదాకా మాట్లాడొద్దు..

‘ప్రజ్వల్ రేవణ్న భారత్‌కు తిరిగి వచ్చేదాకా మహిళల మంగళ సూత్రాల గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దు’ అంటూ ప్రియాంక తీవ్రంగా దుయ్యబట్టారు.