ఇండోర్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్

30-04-2024 12:05:00 AM

నామినేషన్ వెనక్కి తీసుకున్న పార్టీ అభ్యర్థి అక్షయ్

ఆ వెంటనే బీజేపీలో చేరిక.. కాంగ్రెస్ నేతల నుంచి ఆగ్రహ జ్వాలలు 

సూరత్ తరహాలో ఏకగ్రీవం దిశగా ఎన్నిక?

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌కు తగిలింది. పార్టీ ఎంపీ అభ్యర్థి అక్షయ్‌కాంతి బామ్ సోమవారం తన నామినేషన్‌ను ఉప సంహరించుకుని ఆ వెంటనే బీజేపీలో చేరారు. బీజేపీ నేతలతో కలిసి ఆయన ప్రయాణిస్తున్న ఫొటోను అక్కడి బీజేపీ మంత్రి విజయ వర్గీస్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయగా అక్షయ్ చేరిక చర్చనీయాశమైంది. ఈ నెల 13న నాలుగో దశ పోలింగ్ జరగనుండగా తమ పార్టీ అభ్యర్థి బీజేపీలో చేరడం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇండోర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ నేత, సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీపై పోటీగా కాంగ్రెస్ పార్టీ అక్షయ్‌ని బరిలోకి దింపింది. ఇటీవల ఆయన నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల ఉప సంహరణకు చివరి గడువు. అక్షయ్ చివరి రోజు తన నామినేషన్‌ను ఉప సంహరించుకుని, ఆ తర్వాత బీజేపీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నట్లు అక్కడి కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అశీష్ సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్ నేతలు, నాయకుల ఆగ్రహం

అక్షయ్‌కాంతి బామ్‌కు టికెట్ ఇచ్చే ముందే, ఆయన ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించామని, అయినప్పటికీ తమ గోడును ఎవరూ పట్టించుకోలేదని పార్టీ సీనియర్ నేత దేవేంద్రసింగ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు పార్టీకి సేవలందించిన వారిని పక్కన పెట్టి రాజకీయా ల్లో నిలకడ లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం తమను బాధించిందని ప్రకటించారు.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానంలో ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైనట్లే ఇక్కడ కూడా అవుతుందా..? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ పార్టీల్లో మొదలైంది.