11 April, 2026 | 4:10 AM

నేరాల నివారణకు ముందస్తు నిఘా అవసరం

11-04-2026 02:27 AM
  1. రాత్రి వేళ పెట్రోలింగ్ ముమ్మరం.. అప్రమత్తతే నేరాల నివారణకు ఆయుధం..
  2. ప్రజల విశ్వాసమే లక్ష్యంగా పనిచేయాలి..
  3. బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..

బాన్సువాడ,ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): నేరాల నివారణకు ముందస్తు నిఘా అవసరమని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లోని సిబ్బంది హాజరు (రోల్ కాల్), వారి క్రమశిక్షణ,సమయపాలనను స్వయంగా పరిశీలించారు.

విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాను చెబుతున్న సూచనలు సిబ్బందికి ఏ మేరకు అర్థమయ్యాయో కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులు,ఫిర్యాదుదారుల పట్ల మానవీయ కోణంలో గౌరవంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని త్వరితగతిన పరిష్కరించడం ద్వారా పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలని ఆయన కోరారు.

ప్రజల ఫిర్యాదుల పట్ల వేగంగా స్పందించి పరిష్కార దిశగా పనిచేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవల జరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, రాత్రి సమయాల్లో నిరంతర పెట్రోలింగ్, గస్తీ పెంచాలని, అనుమానితులపై నిశిత నిఘా ఉంచాలని బాన్సువాడ ఎస్.హెచ్.ఓ  శ్రీధర్ ని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడరాదని, ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిఎస్పి విఠల్ రెడ్డి, ఎస్.హెచ్.ఓ శ్రీధర్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.