11 April, 2026 | 6:36 PM

నేడే పోలింగ్

13-05-2024 01:34 AM

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 

13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే 

17 లోక్‌సభ స్థానాలకు 525 మంది పోటీ 

సికింద్రాబాద్ బరిలో అత్యధికంగా 45 మంది 

అదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు 

15 మంది అభ్యర్థులకు ఒక ఈవీఎం ఏర్పాటు  

సిబ్బంది, ఈవీఎంల వాహనాలకు జీపీఎస్  

రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు 

మల్కాజిగిరి పరిధిలో అత్యధికంగా 3,226 స్టేషన్లు 

అత్యల్పంగా మహబూబాబాద్‌లో 1,689 స్టేషన్లు 

మొత్తం ఓటర్లు : 3,32,32,318

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగనున్నది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కూడా నిర్వహించనున్నారు. ఉదయం ౭ గంటల నుంచి సాయంత్రం ౬ గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం సకల ఏర్పాట్లు చేసింది. ఎండలు మండిపోతుండటంతో పోలింగ్ కేంద్రాలవద్ద అదనపు ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది, ఈవీఎలు, వీవీప్యాట్ పోలింగ్ కేంద్రాలకు చేరాయి.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటల వరకే ఉండాల్సిన పోలింగ్ సమయాన్ని ఈసీ ఒక గంట పొడిగించింది. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున సాయంత్రం ఓటర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నదని, వారంతా ఓటు వేసేందుకు పోలింగ్ సమయం పొడిగించాలని రాజకీయ పార్టీల కోరటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకొన్నది.  అయితే, సమస్యాత్మకవైనవిగా గుర్తించిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మాత్రం పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగుతుంది. ఈవీఎంలు, ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటుచేశారు. ఈవీఎంలలో సాంకతిక సమస్యలు తలెత్తితే వెంటనే సరిదిద్దేందుకు ఈసీఐఎల్ ఇంజినీర్లను అందుబాటులో ఉంచారు. 

బరిలో ౫౨౫ మంది

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిసి 525 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ స్థానంలో 45 మంది బరిలో ఉన్నారు. జహీరాబాద్‌లో 44 మంది, చేవెళ్లలో 43 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆదిలాబాద్ నుంచి అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారు. ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,809  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో 61 పోలింగ్ కేంద్రాల్లో 10 మంది లోపే ఓటర్లు  ఉండటం గమనార్హం.

ఒక ఈవీఎంలో 15 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుందని, పోటీలో 15 మందికంటే ఎక్కువ ఉంటే ౨, 30 మంది దాటితే 3 ఈవీఎంలు వినియోగించాల్సి ఉంటుంది.  3 ఈవీఎంలు ఉపయోగించే నియోజకవర్గాలు రెండు ఈవీఎంలు వినియో గించేవి 9, ఒక ఈవీఎం వినియోగంచేది ఒక నియోజకవర్గం ఉన్నది. మొత్తం బ్యాలెట్ యూనిట్లు 1,05,019 ఉన్నాయి. కంట్రోల్ యూనిట్స్ 44,569, మొత్తం వీవీపాట్స్ 48,134 ఉన్నాయని ఈసీ తెలిపింది.

మల్కాజిగిరి సెగ్మెంట్ పరిధిలో అత్యధికంగా 3,226 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. అత్యల్పంగా మహబూబాబాద్‌లో 1,689 ఉన్నాయి. రాష్ట్రంలో క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలు 9,900 ఉండగా, 30 శాతం పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. గ్రేటర్ పరిధిలో వెయ్యి క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించింది. 10, 12, 14 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు మూడు ఉండగా, 20 మంది ఓటర్లు ఉన్న కేంద్రాలు 11 ఉన్నాయి. 50 మంది ఓటర్లు ఉన్నవి 22 ఉన్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరుగుతుంది. ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. 

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు 

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. నలుగురి కంటే ఎక్కువగా కలిసి ఉండొద్దని ఈసీ సూచించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినవారిపైన కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఎన్నికల విధుల్లో 2.94 లక్షల మంది ఉద్యోగులు, ఇతరులు పాల్గొననున్నారు. బందోబస్తు కోసం కేంద్రం నుంచి 160 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్ర పోలీసులు 72 వేల మంది ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి 20 వేల మంది విధుల్లో ఉన్నారు.