05-08-2025 08:35:48 AM
గొల్ల కురుమల సంఘం జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య
తుంగతుర్తి(విజయక్రాంతి): గొల్ల, కురుమల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో జీఎంపీఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వం గొల్ల, కురుమలకు రెండో విడత నగదు బదిలీ చేస్తామని డీడీలు కట్టించుకుని రెండున్నర సంవత్సరాలు గడిచిన గొల్ల కురుమలకు నగదు బదిలీ చేయకపోగా వారిని అనేక విధాల నష్టం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు కావొస్తున్న ఇప్పటివరకు ఎన్నికల ముందు గొల్ల, కురుమలకు ఇచ్చిన హామీ ప్రస్తావనే లేకపోవడం గొల్ల కురుమలను ఆందోళన గురిచేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే గొల్ల, కురుమల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతి పట్టక తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనేకమంది విద్యార్థులు చదువుకునే నిరుద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితి చదువుకున్న యాదవ విద్యార్థులందరికీ వెటర్నరీ పోస్టులు ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపరులకు నెలకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలన్నారు. యాదవుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ మండల అధ్యక్షులు వీరబోయిన రాములు, కొమ్మ లింగయ్య, ఉప్పుల లింగయ్య, మట్టిపెల్లి శ్రీను, నర్సయ్య, గంగరాజు, మధు, వెంకన్న, బిక్షం, శ్రీశైలం, లింగమల్లు తదితరులు పాల్గొన్నారు.