05-08-2025 01:55:17 AM
జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ప్రధాన అంశాలివే..
అప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటల కూడా బాధ్యులే!
* సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్‌లో ఏఈల నుంచి సీఈ వరకు బాధ్యులే
* క్వాలిటీ కంట్రోల్‌తోపాటు ధృవీకరణపత్రాల జారీలో లోపాలు
* నివేదికలో మాజీ సీఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పేర్లు కూడా..
* ఆర్థికపరమైన అవకతవకలకు పూర్తి బాధ్యత కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్‌దే..
* ఎల్ అండ్ టీతో పాటు కాంట్రాక్టర్లందరూ బాధ్యులే..
* సొంతఖర్చులతో కాంట్రాక్టు సంస్థల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేయాలి
అందరూ బాధ్యులే!
* తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి, రూపొందించిన ౬౫౦ పేజీల నివేదికలోని అంశాలను తెలిపే ముందు పేజీ. పీసీ ఘోష్ కమిషన్ సమగ్రంగా విచారణ జరిపిన మొత్తం ఎనిమిది అంశాలను క్లుప్తంగా వివరిస్తూ రూపొందించిన ఇండెక్స్.
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలు, అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. ఈ తతంగానికంతటికీ అప్పటి సీఎం కేసీఆర్ నుంచి మొదలుకొని కిందిస్థాయి ఇంజినీర్లను బాధ్యులుగా చూపింది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించి సంక్షిప్త నివేదికను తయారు చేయాలని పురమాయించిన నీటిపారుదల శాఖ, జీఏడీ, న్యాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీల కమిటీ ఇచ్చిన నివేదికను సోమవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో లోతుగా చర్చించారు.
ఇందులో భాగంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలకు బాధ్యులుగా అనేక మంది ఇంజినీర్లు, అధికారులు, ప్రభుత్వాన్ని నడిపే పెద్దలను గుర్తించింది. వీరందరి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు విఫలమయ్యాయని కమిషన్ పేర్కొంటూ.. గుర్తించిన బాధ్యులతో ఒక జాబితాను విడుదల చేసింది.
ప్రాజెక్టుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్, డిజైన్లు, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం), కేఐపీసీఎల్‌లో ఆర్థిక పరమైన అక్రమాలు, అవకతవకలను పరిశీలించి బాధ్యులను గుర్తించినట్టు కమిషన్ పేర్కొంది. ఈ జాబితాలో అప్పటి సీఎం కేసీఆర్‌తోపాటు, అప్ప టి ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్, అప్ప టి నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావుల నుంచి మొదలుకొని ఆయా విభాగా లు, సంస్థల వారీగా, వ్యక్తిగతంగా వారు చేసి న అవకతవకలను వివరిస్తూ.. జాబితాను రూపొందించారు. ఆ జాబితాలో పేర్కొన్న బాధ్యులు ఇలా ఉన్నారు..
1. బాధ్యులైన ఇంజినీర్లు, అధికారులు
* సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)
* చీఫ్ ఇంజినీర్, సీడీవో
* చీఫ్ ఇంజినీర్లు, ఇంజినీర్లు (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీస్- టీఎస్‌ఈఆర్‌ఎల్)
* సూపరింటెండింగ్ ఇంజినీర్లు
* ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు
* డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు వీరంతా చేసిన అవకతవకలు, లోపాలు
* నమూనాలపై అధ్యయనం చేయకుండా డిజైన్లు తయారు చేయడం
* నిర్మాణంలో పూర్తి నాణ్యతాలోపం
* థర్డ్ పార్టీ పరిశీలన లేకపోవడం
* ఏమాత్రం ప్రభావవంతంగా లేని ఓఅండ్‌ఎం (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్)
2. క్వాలిటీ కంట్రోల్, సర్టిఫికెట్ల జారీలో లోపాలు
* సర్టిఫికెట్లు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు
* బరాజ్ పూర్తయినట్టుగా ఇచ్చిన సర్టిఫికెట్ (మేడిగడ్డ 9.9.2019 నాడు)
* బరాజ్ పనులు పూర్తయినట్టుగా ఇచ్చిన సర్టిఫికెట్ (మేడిగడ్డ 15.3.2021 నాడు) వీరు తప్పుగా, నిబంధనలకు విరుద్ధంగా
కాంట్రాక్టర్లకు లాభం చేసే ఉద్ధేశంతో సర్టిఫికెట్లు జారీ చేశారు.
* అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు వీరు లోపభూయిష్టంగా/లీకేజీలను
పట్టించుకోకుండా సర్టిఫికెట్లు ఇచ్చారు
* ఓఅండ్‌ఎం ఇంజినీర్ ఇన్ చీఫ్, డ్యాం సేఫ్టీ డివిజన్ (వీరు ఓఅండ్‌ఎం కార్యకలాపాల నిర్వహణలో పూర్తిగా వైఫలమయ్యారు)
3. పలువురు ప్రత్యేకంగా పేర్కొనదగ్గ ఇంజినీర్లు
* సీ మురళీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ (నీటి పారుదల)
* బీ హరిరాం, చీఫ్ ఇంజినీర్ (పీసీఎస్‌ఎస్ ప్రాజెక్టు)
(వీరు అసలు కాంట్రాక్టు విధానానికి (లంప్సం, టర్న్‌కీ) సంబంధించిన నిజాలను దాచిపెట్టి, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)ను తప్పుదారి పట్టించినందుకు, అలాగే ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదికలను పట్టించుకోనందుకు బాధ్యులు)
* ఏ నరేందర్‌రెడ్డి, టి శ్రీనివాస్, ఓంప్రకాశ్ సింగ్ (వీరు కావాలనే కాళేశ్వరం కమిషన్ ముందు తప్పుడు వాంగ్మూలం అందించారు.) పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్స్
4. మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ఐఏఎస్ అధికారులు
* ఎస్‌కే జోషి, ప్రిన్సిపల్ సెక్రెటరీ (నీటిపారుదల శాఖ)
(మేడిగడ్డ బ్యారేజీని అడ్డుకునేలా ఉన్న క్రిటికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్ట్‌ను ఈయన బయటకు రానీయలేదు)
* స్మితా సభర్వాల్, ముఖ్యమంత్రి అడిషనల్ సెక్రెటరీ
(కీలకమైన ఫైళ్లను క్యాబినెట్ ముందుకు తీసుకురావడంలో వైఫల్యం చెందారు. బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారు.)
5. అప్పటి మంత్రులు
* ఈటల రాజేందర్, అప్పటి ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి
(మంత్రిగా ఆర్థిక బాధ్యతలను పట్టించుకోలేదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) బోర్డు లో ఆర్థిక శాఖకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ.. కేఐపీసీఎల్‌కు సంబంధించిన బాధ్య తలను విస్మరించారు.)
* నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
(ఎలాంటి జవాబుదారీతనం లేకుండా అనేక సందర్భాల్లో సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. పరిపాలనా పద్ధతి, విధానాన్ని తుంగలో తొక్కారు.)
6. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్
* ప్రత్యక్షంగా, పరిపూర్ణంగా కింది పేర్కొన్న అంశాలకు సంబంధించి జవాబుదారీ..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక (ప్లానింగ్), అమలు (ఎగ్జిక్యూషన్), పూర్తి చేయడం (కంప్లీషన్), ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం)తోపాటు ప్రాజెక్టు ధరల సర్దుబాటు, కాంట్రాక్టులో సవరణలు, సమీక్షా సమావేశాల్లో చెప్పిన ఆర్థిక గ్యారంటీలు.
కేఐపీసీఎల్ ద్వారా జరిగిన ఆర్థికపరమైన అక్రమాలు
7. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)
* గతంలోని, ప్రస్తుత బోర్డు (కేఐపీసీఎల్) సభ్యులందరూ ఈ కింద పేర్కొన్న అంశాలకు సంబంధించి బాధ్యులే..
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లి.(కేఐపీసీఎల్) బోర్డు సభ్యులుగా రుణాలను తీసుకురావడమేగానీ.. ఎన్నడూ పర్య వేక్షించలేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రాజెక్టు అంచనాలను, ఆదాయ మార్గాలను అస్సలు పట్టించుకోలేదు.
* ఆర్థిక, నీటిపారుదల శాఖలకు సంబంధించి కేఐపీసీఎల్ బోర్డులో ఉన్న అధికారులు వీరిపై పెట్టుకున్న విశ్వాసాన్ని పూర్తిగా నేరపూరితంగా ఉల్లంఘించారు,నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.
కాంట్రాక్టర్లు
* ఎల్‌అండ్ టీ (మేడిగడ్డ) ఈ కాంట్రాక్ట్ సంస్థ.. ఎలాంటి
సర్టిఫికెట్ పొందడానికి కూడా అర్హత లేదు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ ను ఖచ్చితంగా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది. ఈ ఖర్చంతా సొంతంగా భరించాలి.
* అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కాంట్రాక్టు సంస్థలు ఆయా బ్యారేజీల వద్ద బయటపడ్డ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ఈ కాంట్రాక్టు సంస్థలదే. ఆ ఖర్చులను ఆయా కాంట్రాక్టు సంస్థలే భరించాలి.