05-08-2025 08:29:07 AM
బెంగళూరు: ధర్మస్థలంలో(Dharmasthala) జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖననాలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team) ఆలయ పట్టణంలోని 11వ స్థలం సమీపంలోని కొత్త ప్రదేశంలో కొన్ని అస్థిపంజర అవశేషాలను కనుగొంది. దీంతో మరోసారి కర్నాటకలోని చారిత్రక ధర్మస్థల లో కలకలం రేగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ధర్మస్థలలో సమాధుల కేసును దర్యాప్తు చేస్తుంది. పెద్ద మొత్తంలో అస్థిపంజర అవశేషాలను గుర్తించారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారంతో కొత్త స్థలంలో ఎముకలు లభ్యమయ్యాయి. డీజీపీ ప్రణబ్ మొహంతి పర్యవేక్షణలో బంగ్లేగుడ్డే ప్రదేశంలో సెట్ తవ్వకాలు చేపట్టింది. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కిందటదిగా భావిస్తున్న మృతదేహం ఆనవాళ్లు లభ్యమయ్యాయి. మెడకు ఉరేసుకున్నట్లు తాడు ఉండడాన్ని సిట్ అధికారులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.
ఇంతలో జయంత్ అనే వ్యక్తి ఆగస్టు 4న ధర్మస్థల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక పోలీసు అధికారి కేసు నమోదు చేయకుండా 15 ఏళ్ల బాలిక మృతదేహాన్ని పూడ్చిపెట్టారని ఆరోపించాడు. 2002-2003 మధ్య కాలంలో అడవిని ఆనుకుని రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహాన్ని కనుగొన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న 40 ఏళ్ల మహిళ మృతదేహమని స్థానిక ప్రజలకు అధికారి తప్పుడు సమాచారం అందించారని ఆయన ఆరోపించారు. ఎటువంటి కేసు నమోదు చేయకుండా, మృతదేహాన్ని పూడ్చిపెట్టారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదును స్వీకరించిన ధర్మస్థల పోలీసులు, ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. శనివారం జయంత్ ఈ ఫిర్యాదును సిట్ ముందుంచారు. వారు ఆయనను స్థానిక పోలీసులను సంప్రదించమని కోరారు.