అందరి సహకారంతో పోలింగ్ ప్రశాంతం
72.54 శాతం పోలింగ్ నమోదు
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి
కరీంనగర్, మే 14 (విజయక్రాంతి): అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు, ప్రజలందరి సహకారంతో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు అమిత్ కటారియా పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియ, ఈవీఎంల అంశంలో ఏమైనా ఫిర్యాదులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 72.54 శాతం పోలిం గ్ నమోదయిందని, గతం కంటే ఈసారి 3.24 శాతం పెరిగిందని తెలిపారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం వల్లే కొంత పోలింగ్ శాతం పెరిగిందని వివరించారు. ఎక్కడా తప్పిదాలు జరగకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, సిరిసిల్ల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవోలు కే మహే శ్వర్, రమేష్‌బాబు, రాజకీయ పార్టీల నాయకులు బాస సత్యనారాయణ, బండ రమణా రెడ్డి, మడుపు మోహన్, సత్తినేని శ్రీనివాస్, రాజేందర్‌రావు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.




