9 May, 2026 | 4:31 AM

తల్లుల పేరుతో కాలయాపన

11-12-2024 12:19 AM
  1. కేసీఆర్ పనైపోయింది.. కేటీఆర్ ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే
  2. ఓల్డ్ సిటీకి రేవంత్ బుల్డోజర్ వెళ్లే దమ్ముందా?
  3. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై ఎంపీ అర్వింద్ ఫైర్

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తల్లుల పేరుతో కాలయాపన చేస్తున్నాయి తప్ప ప్రజలకు పనికొచ్చే పనులపై చర్చించడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. తెలంగాణను దోపిడీ చేసిన దొంగల ముఠా కల్వకుంట్ల ఫ్యామిలీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పని అయిపోయిందని.. కేటీఆర్ ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత పదవి ఎందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలన తెలియడం లేదని.. జిల్లాలు, గ్రామాల్లోకి వెళ్తే సమస్యలు తెలుస్తాయన్నారు.

‘ఓల్డ్ సిటీకి వెళ్లకుండా మూసీ ప్రక్షాళన ఎట్లా పూర్తవుతుంది. ఓల్డ్ సిటీకి రేవంత్ బుల్డోజర్ వెళ్లే దమ్ముందా’ అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రమే జరుగుతుందన్నారు. గుజరాత్ గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలని.. గుజరాత్ మాడల్ గురించి రేవంత్‌రెడ్డికేం తెలుసని ప్రశ్నించారు.

కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పుచేసిపోతే.. రేవంత్‌రెడ్డి దాన్ని రూ.14 లక్షల కోట్లకు పెంచే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. వాగ్దానాల పేరుతో దోచుకోవడం తప్ప ప్రజాపాలన ఎక్కడున్నదన్నారు. నిజామాబాద్ పార్లమెంట్‌కు 2 నవోదయ విద్యాలయాలను కేటాయించిందుకు మోదీకి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.

త్వరలో జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం వస్తుందన్నారు. నిజామాబాద్ జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం అనుమ తిచ్చినా.. రాష్ర్ట ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. పసుపు బోర్డు కోసం కొందరు కేంద్ర మంత్రులు పోటీ పడుతున్నారని.. అయినా బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్‌కే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.