28 May, 2026 | 7:11 PM

తడిసిన వరి ధాన్యం కొనుగోలు

28-05-2026 05:52 PM

మిల్లుల వద్ద లారీలు ఆగకుండా చర్యలు

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

అచ్చంపేట మే 28: రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర దక్కేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అన్నారు. రైతులు ధాన్యం అమ్మకానికి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తేమ కారణంగా తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కూడా రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

గురువారం అచ్చంపేట మండలం చెన్నారం గ్రామం పరిధిలోని లలిత ఉమామహేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్‌, నడింపల్లి సమీపంలోని వెంకటేశ్వర కాటన్ మిల్లులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మిల్లులలో నిల్వ ఉంచిన వరి, మొక్కజొన్న ధాన్యాం బస్తాల నిలువలను పరిశీలించి.. మిల్లింగ్ వ్యవస్థపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లులలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎలా నిల్వ చేస్తున్నారో, గిడ్డంగుల సామర్థ్యం ఎంత ఉందో, నాణ్యత పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధాన్యం నిల్వలో నిర్లక్ష్యం వహిస్తే నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని, వర్షాల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అవసరమైన సిబ్బంది ఉండాలి

వరి, మొక్కజొన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, కవర్లు ఏర్పాటు చేయాలని, నిల్వ గిడ్డంగులు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. హమాలీల సంఖ్య, అందుబాటులో ఉన్న హమాలీలు ఎంత మంది? అనే వివరాలు తెలుసుకొని, అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా తూకం ప్రక్రియ, రవాణా ఏర్పాట్లు వేగవంతం చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు అనంతరం వెంటనే మిల్లింగ్ ప్రక్రియకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు సమయంలో తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను సక్రమంగా పరిశీలించి పారదర్శకంగా నమోదు చేయాలని సూచించారు. రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రతి దశలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలు

రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు, రవాణా, చెల్లింపుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై రైతుల అభిప్రాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.

అధికారులు రైతుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అచ్చంపేట తహసీల్దార్ సైదులు, సంబంధిత శాఖల అధికారులు, మిల్లుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.