20 August, 2026 | 2:38 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి

20-08-2026 12:56 AM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో మంజూరైన ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు, పురపాలక సంఘాల కమిషనర్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో 8,851 ఇండ్లు మంజూరు కాగా, 1,100 ఇండ్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు.

పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను నివేదిక రూపంలో సమర్పించాలని, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.బేస్మెంట్, రూఫ్, స్లాబ్ స్థాయిలో ఉన్న ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఒక్క అనర్హుడికి కూడా చోటు ఉండకూడదని, అర్హులైన వారినే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రకాష్రావు, మేనేజర్ పుష్పలత, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణ శాఖ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.