20-02-2026 02:19:46 AM
ఎట్టకేలకు భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయం
ఆశావహుల తీవ్ర ప్రయత్నాలు
మేడ్చల్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడంతో మేడ్చల్ జిల్లాలో ఆ పార్టీ నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. మార్చి 15వ తేదీ లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పిసిసి అధ్యక్షుడి సమక్షంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ నిర్ణయం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం నాయకులు ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటూ ప్రకటనలు వెలువడడంతో ప్రతిసారి పదవుల కోసం ఆశపడ్డారు. ఏదో ఒకటి అడ్డు రావడంతో వాయిదా పడుతూ వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు రావడంతో నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. మేడ్చల్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి.
నియోజకవర్గ స్థాయి నాయకులతోపాటు ద్వితీయ శ్రేణి నాయకుల సైతం నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు నాయకులు టికెట్ల కోసం పోటీపడ్డారు. టికెట్లు రాని వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని ముఖ్య నాయకులు హామీ ఇచ్చారు. మేడ్చల్ నియోజకవర్గం లో హరి వర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ టికెట్ ఆశించగా వీరికి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వీరు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు.
హరి వర్ధన్ రెడ్డికి ఎన్నికల తర్వాత డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వగా, రెండేళ్లు ఆ పదవిలో కొనసాగారు. ఇటీవల రెన్యువల్ వస్తుందని భావించారు. మళ్లీ డిసిసి పదవి రాకపోవడంతో నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ నామినేటెడ్ పదవి రేసులో ఉన్నారు.
కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో నర్సారెడ్డి భూపతిరెడ్డి కి కూడా నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గంలో శ్రీరంగం సత్యం, ఉప్పల్ నియోజకవర్గంలో బొంతు రామ్మోహన్, కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో శ్రీశైలం గౌడ్ ఆశావహుల జాబితాలో ఉన్నారు.
ద్వితీయ శ్రేణి నాయకులు సైతం....
ఆయా నియోజకవర్గాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల సైతం నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. మేడ్చల్ జిల్లా మొత్తం అర్బన్ జిల్లాగా మారింది. అంతేకాక మూడు మున్సిపాలిటీలు మినహా మిగతా ప్రాంతమంతా మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో చేర్చడంతో పదవులు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో కార్పొరేషన్ చైర్మన్ లను మాత్రమే నియ మించింది. డైరెక్టర్లను నియమించలేదు. డైరెక్టర్ పదవులు ప్రతి నియో జకవర్గానికి రెండు కేటాయించాలని గతంలో పార్టీ నిర్ణయించింది. అప్పట్లో జిల్లా నుంచి పేర్లు కూడా తీసుకున్నారు. కొత్తగా మళ్లీ పేర్లు తెప్పించుకొని పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని ద్వితీయ శ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఆశావహుల ప్రయత్నాలు
నామినేటెడ్ పదవి ఎలాగైనా సాధించాలని పలువురు నాయకులు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదివరకే రాష్ట్ర నాయకులను కలిసి తమకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని విన్నవించారు. మళ్లీ ముఖ్యమంత్రి సన్నిహితులను, మంత్రులను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. డైరెక్టర్ పదవులు ఆశిస్తున్న వారు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల సందడి నెలకొంది.