12 May, 2026 | 1:46 AM

హెచ్‌ఎంలకు ప్రమోషను కరువు

12-05-2026 12:59 AM

దశాబ్దాల నుంచీ ఎదురుచూపులే..

  1. ఒకే క్యాడర్‌లో రిటైర్డ్ అవుతున్న ప్రధానోపాధ్యాయులు 
  2. సర్వీసు రూల్స్‌ను సాకుగా చూపుతున్న ప్రభుత్వం

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): వ్యవస్థలోని కొన్ని తప్పిదాలు ఉపాధ్యాయులకు శాపంగా మారుతున్నాయి. దీంతో పదో న్నతులు పొందకుండానే ప్రధానోపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా ప్రమోషన్లు లేక.. వాటి కోసమే ఏండ్ల తరబడిగా ఎదురుచూస్తూ చివరికి రిటైర్డ్ అయిపోతున్నారు. అయినా వారిగురించి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడంలేదు.

సర్వీసు రూల్స్ పేరుతో ఏవేవో సాంకేతిక సమస్యలు, కోర్టు సమస్యలు సాకుగా చూపి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్వీసు కాలంలో అందరిలాగే తమకు ప్రమోషన్లు రాకపోవడంతో అదే క్యాడర్‌లో పదవీ విరమణ చేయాల్సి వస్తోంది. అసలు ప్రమోషన్లే లేకుండా పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ కేటగిరీల్లో.. అతికొద్దిమందిలో వీరూ ఉంటున్నారు. 

రెండు దశాబ్దాలుగా..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు దాదాపు 4,420 వేల మంది వరకు ఉంటారు. వీరంతా గతంలో 1989, 1991, 1994 బ్యాచ్‌కు చెందినవారు. వీరంతా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొంది ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులు (హెచ్‌ఎం)గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరిలో ఇప్పటికే పలువురు పదవీ విరమణ పొంద డంతో ఇంకా 4 వేల మంది వరకు ఉన్నారు. అయితే వీరికి గత 21 ఏండ్లుగా ఒక్క ప్రమోషన్ కూడా దక్కలేదు.

చివరగా ఒకసారి 2005 లో ప్రమోషన్లను చేపట్టిన విద్యాశాఖ ఇంతవరకు వీరికి ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టనేలేదు. ప్రమోషన్లు నిలిచిపోవడంతో డైట్ లెక్చరర్లుగా, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ , కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ తరహా పదోన్నతులు కోల్పోతున్నారు. విద్యాశాఖలో ఏర్పడే ఖాళీలను బట్టి ఎప్పటికప్పుడు ప్రమోషన్లను ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చే స్తోంది. దీంతో డైట్ కాలేజీల్లో లెక్చరర్ల కొరత తీవ్రంగా ఉంది. డిప్యూటీ ఈవో పోస్టుల పరిస్థితీ అంతే. 

సర్వీస్ రూల్స్‌ను సాకుగా చూపి..

2018లో కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ సర్వీస్ రూల్స్‌ను అమలు చేసి ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులను కల్పించాలి. కానీ ఈ సర్వీస్ రూల్స్‌కు సంబంధించి కోర్టులో కేసులున్నాయని, న్యాయపరమైన చిక్కులు తలెత్తుతా యని సాకుగా చూపిస్తూ ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టడంలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం కూడా అప్పట్లో దీన్ని పట్టించుకోలేదు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమూ హెచ్‌ఎంలకు పదోన్నతులు కల్పించ డంలేదని ప్రధానోపాధ్యాయ సంఘాల నేతలు వాపోతున్నారు. దీంతో హెచ్‌ఎంలుగానే వా రంతా రిటైర్ కావల్సిన పరిస్థితి వచ్చింది. పలువురు కారుణ్య నియామకాల కింద క్లర్కులు /జూనియర్ అసిస్టెంట్‌లుగా ఉద్యోగాలు పొందినవారు నేడు వీరికంటే పై హోదాల్లో ఉంటున్నారు.

కారుణ్య నియామకం కింద ఒక ఉద్యోగిని క్లర్క్‌గా ఉద్యోగంలో చేరి ఇప్పుడు ఓ జిల్లాకు ఇన్‌చార్జ్ డీఈవోగా ఉన్నారు. అలాగే మరొక జిల్లాలో రికార్డ్ అసిస్టెంట్‌గా చేరి ఏడీగా ఉంటూ డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలా చాలామంది ఉన్నారు.

ఇలా తమ కళ్ల ముందే ఉద్యోగాల్లో చేరిన వారు తమకంటే పై హోదాల్లో ఉంటున్నారని, తాము మాత్రం హెచ్‌ఎంలుగా వారి ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వస్తోందని ఓ ప్రధానోపాధ్యాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. హెచ్‌ఎంల కంటే కిందిస్థాయిలో, వీరికంటే పై స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు సక్రమంగానే వస్తున్నాయి. కానీ వీరికి మాత్రం పదోన్నతుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.