12 May, 2026 | 2:26 AM

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగించాలి

12-05-2026 01:00 AM

ఎమ్మెల్యే వేముల వీరేశం

కట్టంగూరు, మే 11 : నియోజకవర్గంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా సాగించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి, నార్కట్పల్లి, చిట్యాల, రామన్న పేట మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరు, రోజువారీ కొనుగోళ్లు, రైస్ మిల్లులకు తరలింపు, రైతులకు చెల్లింపులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి, ఎలాంటి ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించాలన్నారు. గన్నీ బ్యాగులు, తేమ కొలిచే మీటర్లు, తూకం యంత్రాలు సరిగ్గా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రైతు కష్టానికి సరైన గౌరవం దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. ఏ రైతుకూ అన్యాయం జరగకుండా చూడటం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు,జిల్లా పౌరసరఫరాల అధికారులు,  వివిధ మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ ఏడి, ఏఓలు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, ఐకెపి, పిఎసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం  

కట్టంగూర్ మే 11 : విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను సోమవారం ప్రారంభించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

తదుపరి ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తూ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామన్నాడు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామన్నారు. కట్టంగూర్ జడ్.పి.హెచ్.ఎస్ లో డిజిటల్ క్లాస్రూమ్లు, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అలాగే కేజీబీవీలో బాలికలకు హాస్టల్ వసతితో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.