జల వనరుల రక్షణా అప్పగింతా
- శ్రీశైలంలో నీటిని తోడేస్తున్న ఏపీ ప్రభుత్వం
- నిమ్మకు నీరెత్తినట్టు తెలంగాణ సర్కారు
- ఏపీ జలదోపిడీపై మంత్రి జూపల్లి వంటావార్పుకు పిలుపివ్వడంపై సర్వత్రా విస్మయం
- ఏపీ జలదోపిడీపై చేష్టలుడిగిన తెలంగాణ
హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): మొన్నటి సీజన్‌లో భారీగా వర్షాలు కురిసి రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపించాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండాయి. అనేక సార్లు గేట్లు కూడా ఎత్తివేశారు. దీంతో ఈ సంవత్సరం తెలంగాణలో ఎలాంటి నీటి ఎద్దడి ఉండదని అందరూ అనుకున్నారు. అయితే గడిచిన ఎనిమిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా నీటిని భారీగా తరలించుకుపో తున్నది. తెలంగాణ కూడా తన అవసరాలమేరకే కృష్ణానీటిని తరలిస్తూ.. జల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూవచ్చింది.
రిజర్వాయర్‌లో కనిష్ఠ నీటిమట్టం 834 అడుగులకు చేరితే.. జల విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ.. ఏపీ మాత్రం ఎలాంటి జంకూ లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని తమ ప్రాంతానికి తరలించుకుపోతున్నది. గురువారం (ఈ నెల 2 తేదీ) నాటికి రిజర్వాయర్‌లో జల మట్టాన్ని పరిశీలిస్తే.. శ్రీశైలంలో 823.5 అడుగులకు చేరింది. అం టే ఉపయోగించుకోవడానికి వీలైన జలాలు కేవలం 12 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నమాట.
నిస్తేజంగా తెలంగాణ సర్కారు..
శ్రీశైలం రిజర్వాయర్‌లో కనిష్ఠ నీటిమట్టం స్థాయి 834 అడుగులు అయితే.. గురువారంనాటికి 823.5 అడుగులకు చేరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిస్తేజంగా ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం. కనీస నీటిమట్టం కంటే దిగువన సుమారు 12 అడుగుల వరకు జల వనరులను ఏపీ తరలించుకుపోయిందనే దానికి సజీవ సాక్ష్యంగా చెప్పవచ్చు. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలతోపాటు ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలు, ప్రజాప్రయోజనాలను కాపాడాలి. కానీ ఇక్కడ పక్క రాష్ట్రం మన జల వనరులను తరలించుకుపోతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం ఉందా? లేక పక్క రాష్ట్ర ప్రయోజనాల కోస మా? ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతున్నది.
కృష్ణా బోర్డుపై ఒత్తిడి ఏదీ?
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లోని నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా వాడుకోవాలనే మాన్యువల్‌ను కృష్ణాబోర్డు అమలు చేస్తున్నది. మరి కేవలం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, ఇందులోని నీటి వనరులను రెండు రాష్ట్రాలకు పంచేందుకే ఏర్పడిన కృష్ణా బోర్డు సక్రమంగా వ్యవహరించకుండా ఏపీకి వత్తాసు పలుకుతున్నప్పుడు ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎప్పుడూ నిలదీసి నట్టుగా కనపడటం లేదు.
జాతీయ వేదికలపై సమస్యను లేవనెత్తినట్టుగా కూడా ఎక్క డా లేదు. జలవనరుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుపై ఏమాత్రం ఒత్తిడి తేకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకని తెలం గాణ ప్రభుత్వం విఫలమవుతు న్నది? ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నది? ఎందుకు సూటిగా ప్రశ్నించలేకపోతున్నది? ఎందుకు ఏపీ జల దోపిడీని అడ్డుకోలేకపోతున్నదనే ప్రశ్నలు రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
అనుమానాలకు తావిస్తున్న సర్కారు తీరు
జల వనరుల దోపిడీ విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నది. పైగా ఏపీలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్‌దాస్‌ను జల వనరుల సలహాదారుగా నియమించుకున్నప్పటి నుంచి ప్రజల్లో, ప్రతిపక్షాల్లో అనుమానాలు మొదల య్యాయి. అదీకాకుండా నీటిపారుదల శాఖకు సలహాదారునిగా నియమించబడిన ఆదిత్యనాథ్ దాస్ వద్ద పనిచేసేందుకు మొత్తం 8 మంది వరకు ఏపీలో పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బందిని నియమించుకోవడంపైకూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
అలాగే అనేక సందర్భాల్లోనూ ఏపీ వ్యవహారాలను ఎక్కడికక్కడ ఖండించా ల్సిన తెలంగాణ ప్రభుత్వం చేష్టలుడిగిపోవడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇక్కడి ప్రభుత్వం.. ఇక్కడి ప్రజల ప్రయోజనాలను కాపాడకుండా.. పక్క రాష్ట్రం ఏం చేస్తున్నా నిమ్మకునీరెత్తినట్టు ఉండటంపై విమర్శల్లో బలం పెరుగుతున్నది. సాక్షాత్తు మంత్రి జూపల్లే.. నిరసనలకు, ధర్నాలకు పిలుపివ్వడం ప్రతిపక్షాలకు మరో బలమైన ఆయుధంగా ఉపయోగపడుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, అదే స్థాయిలో చర్యలు తీసుకోకపోతే ఏపీకి తొత్తుగా మారిందనే అపవాదును మోయాల్సి ఉంటుంది.
ఉదాహరణ-1
మీరు.. దారి వెంట వెళుతున్నప్పుడు ఎవరైనా దొంగ ఎదురై.. మిమ్మల్ని దో చుకోవడానికి ప్రయత్నిస్తే ఏం చేస్తారు? దొంగాదొంగా అంటూ అరిచి.. ఎవరి సహాయం కోసమైనా చూస్తారు. లేదా పోలీసుల సాయం కోసమైనా ప్రయత్నిస్తారు.
ఉదాహరణ-2
ఒకవేళ పోలీసుకే దొంగ ఎదురై.. దోచుకోవడానికి ప్రయత్నిస్తే.. పోలీసు ఏంచేస్తారు? రక్షించండి అని అరుస్తారా? లేక ఇతరుల సాయం కోసం ఎదురుచూస్తారా? తానే పోలీసు కను క.. దొంగను పట్టుకుని జైలులో వేస్తా రు. ఈ సమాధానం కరెక్టే. తానే పోలీసు కనుక.. దొంగను పట్టుకుని జైలుకు పంపిస్తాడు. సాధారణంగా అందరూ చెప్పే సమాధానం అదే. వాస్తవంకూడా అదే. సామాన్యుడికి.. పోలీసుకు తేడా కూడా అదే. కానీ తెలంగాణ ప్రభుత్వం వైఖరి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్‌తోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సా ధించుకున్నాం. కానీ తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని అనుకోవాల్సి వస్తున్నది. తాజాగా కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్టులోని జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం చీమకుట్టిన ట్టుకూడా వ్యవహరించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పైగా అదే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు.. అసలు విషయాన్ని బయటపెట్టేలా ప్రజలను ఉసిగొల్పి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం తెలంగాణ ప్రజలను ఆశ్చర్యపోయేలా చేసిం ది అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను రక్షిస్తున్నట్టా? లేక ఏపీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నట్టా? అనే అనుమానాలను బలపడేలా చేస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది.
శ్రీశైలం రిజర్వాయర్‌లో కనిష్ఠ నీటిమట్టం స్థాయి 834 అడుగుల (254.2 మీటర్లు)కు చేరుకున్నప్పుడు జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉంది. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా ఏపీ సర్కా రు అక్రమంగా, అన్యాయంగా నీటిని తోడేస్తున్నది.
ఈ అంశంపై ఎన్నిసార్లు విన్నవించినా.. ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదు. అందుకే ఉమ్మడి మహ బూబ్‌నగర్ జిల్లా రైతాంగం, అదే విధం గా కృష్ణా పరీవాహక ప్రాంత జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం ఉమ్మడి జి ల్లా ప్రజాప్రతినిధులం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చాం
మార్చి 31న గాంధీభవన్ ప్రెస్‌మీట్‌లో
మంత్రి జూపల్లి కృష్ణారావు




