13-11-2025 12:00:00 AM
మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ మేఘన సుభాష్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): నిమోనియా అనేది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే తీవ్రమైన ఇన్ఫెక్షన్ అని, దీన్ని ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చునని మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ మేఘన సుభాష్ తెలిపారు. అన్ని వయసుల వారిలో కనిపించే ఈ వ్యాధి, ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం లేదా హృదయ సంబంధ వ్యాధులతో ఉన్నవారిలో ప్రమాదకరం అని చెప్పారు.
ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, అలసట, ఆకలి తగ్గడం. కారణాలు బ్యాక్టీరియా, వైరస్లు (ఫ్లూ, కోవిడ్), ఫంగస్, లేదా ఆహారం ఊపిరితిత్తుల్లోకి చేరడం. ఛాతీ ఎక్స్-రే, రక్త, కఫ పరీక్షలతో నిర్ధారణ చేయవచ్చు. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్, ద్రవాలు, విశ్రాంతి, అవసరమైతే ఆక్సిజన్ సపోర్ట్.
ఆక్సిజన్ స్థాయి 92% కన్నా తక్కువగా ఉన్నప్పుడు, వేగంగా శ్వాస లేదా గందరగోళం ఉంటే ఆస్పత్రిలో చేరాలి. చేతులు శుభ్రంగా ఉంచడం, పొగతాగడం మానడం, పోషకాహారం తీసుకోవడం, న్యూమోకోకల్, ఫ్లూ టీకాలు వేయించుకోవడంతో నివారించవచ్చు అని డా. మేఘన సుభాష్ తెలిపారు.