24-04-2025 01:32:41 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో మంగళవారం ఉగ్రముకలు పర్యాటకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన ఘటనపై మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నిరసన వెల్లువెత్తింది. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండల కేంద్రాలు గ్రామాల్లో సైతం ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతి కోసం బుధవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. వివిధ చోట్ల ఉగ్ర దిష్టిబొమ్మలను కాల్చి ఉగ్ర ఘటనలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమాయకుల ప్రాణాలను బలిగొనడం పిరికి చర్యగా పేర్కొన్నారు. భారతదేశ ప్రజలంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.