సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కలెక్టరేట్ ముందు నిరసన
సూర్యాపేట (విజయక్రాంతి): విధ్యాశాఖలో సమగ్ర శిక్ష పథకంలో కాంట్రాక్ట్ పద్దతిన విధులు నిర్వహిస్తున్న వారందరిని రెగ్యులర్ చేయాలని కోరుతూ తెలంగాణ సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ వరంగల్‌లో ధర్నా చేస్తున్న తమకు పీసీసీ అధ్యక్షుడి హోదాలో వచ్చిన నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాడు తమ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలు తీర్చుతామని హామీ ఇచ్చాడని ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. అలాగే ప్రతి ఉద్యోగికి జీవిత భీమా రూ.10 లక్షలు, ఆరోగ్య భీమా రూ.10 లక్షల సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న వారికి బెనిపిట్స్ కింద రూ.25 లక్షలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటరమణ, ఉపాధ్యక్షుడు రాంబాబునాయక్, కోశాధికారి కె.లక్ష్మీనారాయణ, కార్యదర్శి సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.






