కొత్తగూడెంలో GO 76ను వెంటనే అమలు చేయాలి
బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): GO 76ను వెంటనే అమలు చేసి, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ వద్ద మంగళవారం ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గంలో(Kothagudem Constituency) ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) ఇప్పటికైనా స్పందించాలని ,జీవో నెంబర్ 76 అర్హులైన పేదలందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మొద్దు నిద్రలో ఉన్న ఎమ్మెల్యే వెంటనే మేల్కొని, నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ముందు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై స్పందించి, వాటి పరిష్కారానికి కృషి చేసిన అనంతరం ఢిల్లీలో బీజేపీపై పోరాటాలు చేయాలని పట్టణ అధ్యక్షులు శీలం విద్యాసాగర్(Sheelam Vidyasagar) సూచించారు. ఈ నిరసన దీక్షలో జిల్లా నాయకులు సీతారాముల నాయక్, ఆకుల నాగేశ్వరరావు గౌడ్, పోనీశెట్టి వెంకటేశ్వర్లు, నోముల రమేష్,రాయుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






