3 June, 2026 | 1:47 AM

మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమకారుల నినాదాలు

03-06-2026 12:00 AM

తమను పట్టించుకోవడంలేదని నిరసన 

మేడ్చల్, జూన్ 2 (విజయక్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తీరుపై సొంత పార్టీలోని ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో ఉద్యమకారులు అసంతృప్తి గళం వినిపించగా, తాజాగా ఏకంగా మల్లారెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా పట్టణంలోని కేఎల్‌ఆర్ కమాన్ వద్ద ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మల్లారెడ్డి తీరుపై మండిపడ్డారు. మల్లారెడ్డి ఉద్యమకారులకు సరైన గుర్తింపు నివ్వడం లేదని, భజనపరులకు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మల్లారెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేరని, ఎవరు ఉద్యమకారులు అనే విషయం కూడా ఆయనకు సరైన అవగాహన లేదని విమర్శించారు. మల్లారెడ్డి తీరు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము మొదటినుంచి పార్టీలో ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని వారు పేర్కొన్నారు. ఇకనైనా మల్లారెడ్డి తీరు మారాలన్నారు. ఇటీవల జరిగిన బి ఆర్ ఎస్ కార్యకర్తల సమావేశంలోనూ ఉద్యమకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరసన స్వరం పెంచారు. అంతేగాక జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.