20-01-2026 03:42:10 PM
విజయ క్రాంతి కథనానికి స్పందన
బెల్లంపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులతో పనులు చేయించిన ప్రజ్ఞ మోడల్ స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలనీ ఆందోళన మొదలైంది. మంగళవారం ప్రజ్ఞ పాఠశాల ఎదుట ఏఐఎస్బి విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. కన్నెపల్లి లోప్రజ్ఞ పాఠశాల యజమాన్యం విద్యార్థులతో భవన నిర్మాణ పనులు చేయిస్తున్న సంఘటనపై విజయ క్రాంతి దినపత్రికలో "స్కూలుకు పంపించింది నిర్మాణ పనులు చేయించడానికకేనా..?" అనే శీర్షికతో వచ్చిన కథనానికి విద్యార్థి సంఘాలు స్పందించాయి.
ఈ మేరకు మంగళవారం విద్యార్థులతో నిర్మాణ పనులు చేపించిన యాజమాన్యం పాఠశాలను రద్దు చేయాలని కదం తొక్కారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని ప్రజ్ఞ మోడల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో వెట్టిచాకిరి చేయిస్తూ బాలల హక్కులను ఘోరంగా ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐఎస్బి) ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి కునుకుంట్ల సన్నీ గౌడ్ మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో పనులు చేయిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకోవాల్సిన చిన్నారులను తమ సొంత పనుల కోసం వినియోగిస్తూ, ఇటుకలు మోయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు.
ఇలాంటి పాఠశాలలకు సమాజంలో చోటు ఉండకూడదని, వెంటనే ప్రజ్ఞ మోడల్ స్కూల్ గుర్తింపును జిల్లా విద్యాశాఖ అధికారులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల హక్కులను కాలరాసిన పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు. ఈ ఘటనపై మండల విద్యాశాఖ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి పంపించి తగని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు.