ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి(District Additional Collector Deepak Tiwari) అన్నారు. బుధవారం కెరమెరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలు, రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ధ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వర్షాకాలంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని సూచించారు.
అనంతరం మండలంలోని మోదీ గ్రామంలో గల ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి మౌలిక వసతులు, తరగతి గదిలో విద్య బోధన పరిశీలించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతుల మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేయాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. బోధన సమయంలో ఉపాధ్యాయులు చెప్పే విషయాలను విద్యార్థులు ఏకాగ్రతతో వినాలని, ఆసక్తిగా చదవాలని తెలిపారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






