కవ్వింపు చర్యలు!
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతకాలం స్తబ్తుగా ఉన్న పాక్ తమకు పక్కలో బల్లెంలా తయారైన తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)ను అణచివేసే క్రమంలో అఫ్గానిస్థాన్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడింది. తమ దేశంలో ఉగ్ర మూలాలను పెంచి పోషిస్తున్న టీటీపీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన ఏడు ఉగ్రవాద స్థావరాలపై ఆదివారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) వైమానిక దాడులతో విరుచుకుపడింది.
పాక్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. పాకిస్థాన్ మాత్రం 70 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సగర్వంగా ప్రకటించుకుంది. అయితే పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద కార్యకలాపాలు, డ్యూరాండ్ లైన్ వివాదం, సరిహద్దుల మూసివేత, ఉగ్రవాదులకు ఆశ్రయం వంటి అంశాలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేర్చిన సందర్భాలు కోకొల్లలు.
తాజా దాడులకు టీటీపీ ఉగ్రవాదాన్ని పెంచిపోషించడమే కారణమని పాక్ మరోసారి పాత పాటే పాడింది. ఆఫ్గన్ కేంద్రంగా టీటీపీ ఉగ్రవాదులు శిబిరాలు ఏర్పాటు చేసుకుని తమపై దాడులు చేస్తుందని, వీరికి తాలిబన్ల మద్దతు ఉందని పాక్ ఎప్పటినుంచో ఆరోపిస్తుంది. అయితే పాక్ వాదనను అఫ్గానిస్థాన్ కూడా ఎప్పటికప్పుడూ కొట్టిపారేస్తూనే వచ్చింది. తాలిబన్ ఆశీస్సులతోనే టీటీపీ తమపై రెచ్చిపోతుందన్న పాకిస్థాన్ వాదన కొట్టిపారేయలేము.
తాలిబాన్ మధ్యవర్తిత్వంతో 2021లో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం టీటీపీతో చర్చలు జరిపింది. ఆ చర్చలు సత్ఫలితాన్ని ఇవ్వకపోగా, అఫ్గాన్‌ను అమెరికా విడిచివెళ్లిన తర్వాత ఆయుధాలు టీటీపీ చేతుల్లోకి వెళ్లడంతో అది మరింత బలోపేతమైంది. ఈ నేపథ్యంలో ఒకవేళ టీటీపీని నియంత్రిస్తే అందులోని సాయుధులంతా ఐసిస్ వంటి ప్రమాదకర సంస్థలో చేరితే తమ మనుగడకు ప్రమాదమని తాలిబన్లు భావించారు.
అందుకే ఇతర ఉగ్రసంస్థలను నిలువరించడానికి టీటీపీతో తాలిబన్లు ఎప్పుడు సఖ్యతతోనే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక అఫ్గాన్, పాకిస్థాన్‌ల మధ్య వివాదానికి ‘డ్యూరాండ్ రేఖ’ కూడా ఒక కారణమే. బ్రిటీష్ కాలంలో 1893లో విభజన జరిగిన సమయంలో పష్తూన్ ప్రజల తెగ రెండు దేశాలకు చీలిపోయింది. డ్యూరాండ్ తమ భూభాగాన్ని విభజించిందని తాలిబన్లు పేర్కొంటే, పాకిస్థాన్ మాత్రం ఇది అధికారిక సరిహద్దు అని వాదిస్తూ వస్తున్నది.
ఈ వాదనలు దశాబ్దాలుగా కొనసాగుతూనే వస్తున్నాయి. ఒకవైపు టీటీపీ, మరోపక్క బలూచ్, పష్తూన్ తిరుగుబాటుదారుల విధ్వంసకాండలతో పాకిస్థాన్ నలిగిపోతోంది. తాలిబన్‌తో నేరుగా యుద్ధానికి దిగి గెలిచే స్థితిలో లేకపోవడంతోనే పాక్ అడపాదడపా సరిహద్దుల్లోకి చొరబడి దాడులు చేయడం అలవాటు చేసుకుంది. పేరుకు ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తున్నట్టుగా పాకిస్థాన్ తమ ప్రజలను మభ్యపెడుతూ వస్తుంది.
ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఏళ్లుగా నివసిస్తూ వచ్చిన లక్షలాదిమంది అఫ్గాన్లను వెళ్లగొట్టడం ఉభయదేశాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. మరోపక్క అఫ్గానిస్థాన్‌తో భారత్‌కు సాన్నిహిత్యం పెరగడం పాక్‌కు రుచించడం లేదు. గతేడాది అక్టోబర్‌లోనూ పాక్, అఫ్గాన్‌లు పరస్పరం ఘర్షణకు దిగాయి. అయితే ఇరుదేశాల మధ్య పలుమార్లు చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి.




