5 June, 2026 | 3:19 AM

గ్రామాల్లో బినామీ సర్పంచులు!

05-06-2026 01:37 AM
  1. పని ఏదైనా జరగాలంటే పెద్ద నాయకుడే దిక్కు 
  2. రిజర్వేషన్లతో అట్టడుగు వారికి పదవులు 
  3. పేరు, సొమ్ము వారిది.. పెత్తనం పెద్దోళ్లదే..
  4. అప్పులు ఇచ్చిన వాళ్ళతో తిప్పలు పడుతున్న వైనం 

గజ్వేల్, జూన్ 4: రాజ్యాంగం ద్వారా సాధించుకున్న రిజర్వేషన్లతో గ్రామాలలో అట్టడుగు స్థాయి ప్రజలు కూడా రాజకీయంగా పదవులు పొందారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు ఊహించని రీతిలో రిజర్వేషన్లు తలకిందులై అగ్రవర్ణాలతో పాటు రాజకీయంగా పలుకుబడి పొందిన పెద్ద నాయకులకు షాక్ ఇచ్చాయి.

దీంతో అగ్రవర్ణ, రాజకీయంగా ఎదిగిన గ్రామాల్లోని పెద్దలు గ్రామాలలో తమ అధికారం, పలుకుబడి కోల్పోవద్దన్న ఆలోచనతో ఆయా గ్రామాల రిజర్వేషన్ల మేరకు తమకు అనుకూలంగా, నమ్మిన బంటుల ఉండే వారిని సర్పంచ్ గా పోటీ చేయించి పట్టుబట్టి గెలిపించుకున్నారు. వీరికి రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకపోవడం గమనార్హం. ఎలాంటి అనుభవం లేనివారు లక్షలు ఖర్చు పెట్టి  సర్పంచులుగా  గెలిచి గ్రామానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండడం వారి అమాయకత్వానికి, ప్రజల అవివేకానికి నిదర్శనంగా నిలుస్తుంది.   

పని ఏదైనా జరగాలంటే పెద్ద నాయకుడే దిక్కు 

గజ్వేల్ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గ్రామ పరిపాలన, బాధ్యతలు నిర్వహణ తెలియని చాలామంది సర్పంచులు తమను పోటీలో నిలబెట్టి గెలిపించిన పెద్దమనుషుల పైనే ఆధారపడుతున్నారు. గ్రామానికి అభివృద్ధి నిధులు ఎలా తేవాలి, ఏ పనులు చేయాలి, ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వాలి అన్న విషయాలపై పెద్ద మనుషులకే అధికారాన్ని కట్టబెట్టి సర్పంచులు మాత్రం సంతకాలకే పరిమితమవుతున్నారు.

మహిళా సర్పంచుల పరిస్థితి కూడా ఇదే చందాన కొనసాగుతుంది. పేరుకు సర్పంచ్లుగా గెలవడం తప్ప పనులు చేసేదంతా వారి భర్తలే. గ్రామంలో ఏ అవసరం ఉన్న సర్పంచ్ భర్తల వద్దకే ప్రజలు వెళ్తున్నారు తప్ప మహిళా సర్పంచ్లు మాత్రం ఇంటి గడప దాటడం లేదు. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో పాటు మండల స్థాయి వివిధ శాఖల అధికారుల సైతం మహిళా సర్పంచ్ ల భర్తలనే గ్రామ అభివృద్ధి పనుల కోసం సంప్రదించడం గమనార్హం. 

పేరు, సొమ్ము  వారిది.. పెత్తనం పెద్దోళ్లదే

-గ్రామాల్లో పెద్దలు తమ అధికారాన్ని, పలుకుబడిని కొనసాగించడానికి అమాయకులకు అధికారం ఆశ చూపించి సర్పంచులు గా నిలబెట్టారు. తమ వద్ద పోటీ చేయడానికి డబ్బు లేదన్నా కూడా భూములను కుదువ పెట్టించి, అవసరమైతే అమ్మించి డబ్బు సర్దుబాటు చేసి మరి పోటీ చేయించారు. పేరు, సొమ్ము సర్పంచ్లది అయితే పెత్తనం మాత్రం గ్రామ పెద్దలదే కొనసాగుతుంది. అధికారులకు సైతం తమ సర్పంచ్ వస్తాడు పనిచేసి పెట్టండి అంటూ చెప్పడం, అధికారులు కూడా సరైన పనులు చేసి పెట్టడం విడ్డూరంగా మారింది. 

పెద్దల మాటలు విని భూములు ఆస్తులు తనకా పెట్టి అప్పులు తెచ్చి గెలిచిన సర్పంచ్లు ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కొందరు సర్పంచ్లు అయితే అప్పుల వారికి మొహం చూపించలేక గ్రామపంచాయతీ బాధ్యతలు కూడా సరిగా నిర్వహించలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా రాజ్యాంగపరంగా సర్పంచులకు వచ్చిన హక్కులు పెద్దల పేరుతో కాలరాస్తున్నా ఉన్నతాధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్టుగా ఉంది. ఇకనైనా అధికారులు ప్రభుత్వం గ్రామస్థాయిలో సర్పంచ్ల అధికారాలను ఇతరులు ఎవరు దుర్వినియోగం చేయకుండా ఆయా గ్రామాల సర్పంచ్లకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు  నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.