రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలం
రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి, జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెల్మ కన్వెన్షన్ హాల్లో కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథీ గా హాజరై మాట్లాడారు.సీఎం కనిపిస్తే టీవీలు కట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖం చూడటానికి ప్రజలు ఇష్టపడటం లేదు. ప్రజల దృష్టిలో అబద్ధాల కోరుగా, దుర్మార్గుడిగా, చేతకాని సీఎంగా, మోసకారిగా సీఎం మిగిలిపోయాడు అని అన్నారు.పదేళ్లు రాష్ట్రంలో జనరంజక పాలనను కెసిఆర్ కొనసాగించారన్నారు.
కెసిఆర్ రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడెలా ఉందో ప్రజలు గ్రహించాలన్నారు. కేసీఆర్ హయాంలో యూరియా సరఫరా ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించాలి అని తెలిపారు.రైతులంటే రేవంత్ రెడ్డికి అంత చులకనా అని ప్రశ్నించారు.గతంలో 24 గంటలు వచ్చిన కరెంట్ ప్రస్తుతం 11 గంటలే వస్తుందన్నారు.తెలంగాణలో మళ్ళీ మోటార్లు కాలిపోవడం మొదలైందన్నారు.
రాష్ట్రంపై సీఎం, మంత్రులు గద్దల్లా పడుతున్నారన్నారు. వేలకోట్ల భూములు దోచుకుని తింటున్నారు. 14 ఎకరాల స్థలం ఫార్మా సిటీ కోసం భూములు సేకరించి పెడితే ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి దోపిడీకి ప్రయత్నిస్తున్నారన్నారు. సివిల్ సప్లైలో కుంభకోణానికి పాల్పడ్డారు.ఎక్సైజ్ శాఖలో రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. వేణుగోపాల స్వామి ఆలయానికి సంబందించిన 116 ఎకరాల భూమిపై కన్నేశారు.ప్రస్తుతం రైతు డిస్కం పేరుతో దోపిడీకి కుట్ర లేపారన్నారు. ఆదాయం వచ్చే డిస్కంలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఖర్చు చేసేది అన్నారు.
ఫ్యాక్టరీలు, కమర్షియల్స్ మీద వచ్చే ఆదాయాన్ని రైతుల కోసం ఖర్చు చేసేవారన్నారు. ప్రస్తుతం ఆదాయం వచ్చేవి ప్రైవేటుకు, పైసా కూడా ఆదాయం రానివి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఇవ్వన్నిటిని గట్టిగా అడిగితే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు నయా పైసా ఇవ్వడం లేదు అన్నారు. పైపెచ్చు పెట్రోల్ ,డీజిల్ ధరలు పెంచుతున్నారు. హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేయనున్న ఆర్.ఆర్.ఆర్ ను కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింద న్నారు.రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు.
ఆర్.ఆర్.ఆర్ ను ఎందుకు రిజెక్ట్ చేశారో కిషన్ రెడ్డి అడగాలి అన్నారు.రైతు డిస్కంలను మోడీ పెడితే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు.తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి రైతు డిస్కంల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి. కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని టీడీపీ నేతలు అంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఖండించడం లేదు అన్నారు.
తెలంగాణ ఏర్పాటును భారత్, పాకిస్తాన్ తో పోలిస్తే అడ్డుకునే వాళ్ళు లేకుండా పోయారు అన్నారు. కాంగ్రెస్ పాలన తీరుపై ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. రాబోయేది టిఆర్‌ఎస్ పాలననే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారన్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తుందన్నారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దిన్, కామారెడ్డి నియోజకవర్గంలోని టిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు సర్పంచులు , మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసి లు తదితరులు పాల్గొన్నారు.






