పీఎస్‌ఎల్వీ సీ59 ప్రయోగం నేటికి వాయిదా
తిరుపతి, డిసెంబర్ 4: సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం 4.06 గంటలకు నిర్వహించాల్సిన పీఎస్‌ఎల్వీ సీ59 ప్రయోగం వాయిదా పడింది. ప్రయోగానికి గంటముందు ప్రోబా సాంకేతిక సమస్య తలెత్తినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఇస్రో అధికారులు కౌంట్‌డౌన్ నిలిపేసి, ప్రయోగాన్ని వాయి దా వేశారు. పీఎస్‌ఎల్వీని గురువారం సాయంత్రం 4.12 గంటలకు తిరిగి నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా రెండు ఉపగ్రహాలుంటాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేపట్టడం ఈ ప్రాజెక్ట్ ఉద్ధేశం. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించి భానుడికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకునేందు కు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. కాగా ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారి.






